Investors beware: ‘అదానీ’ పెట్టుబడిదారులూ జాగ్రత్త: తృణమూల్ ఎంపీ మహువా మోయిత్ర
- ప్రభుత్వానికి ప్రియమైన గ్రూపు ఖాతాలను ఆడిట్ చేయనంటే ఎలా? అని ప్రశ్న
- డెలాయిట్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తాయా? అని నిలదీత
- ఇప్పుడు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచన
తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ మహువా మోయిత్ర మరోసారి గౌతమ్ అదానీ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన అదానీ పోర్ట్స్ కు ఆడిటింగ్ సేవలు అందిస్తున్న డెలాయిట్ ఆ సంస్థకు రాజీనామా చేయనుందన్నది తాజా సమాచారం. అదానీ పవర్ ఖాతాల్లో కొన్ని లావాదేవీలకు సంబంధించిన వివాదం దీనికి నేపథ్యమని తెలుస్తోంది. దీనిపై అదానీ గ్రూప్ కానీ, డెలాయిట్ కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ పరిణామాలతో మరోసారి అదానీ గ్రూపు కంపెనీ ఖాతా పుస్తకాల నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మహువా మోయిత్ర ఇన్వెస్టర్లను హెచ్చరించారు.
‘‘ఈడీ, సీబీఐ, ఎస్ఎఫ్ఐవో ఇప్పుడు డెలాయిట్ పై దాడులు (సోదాలు) నిర్వహిస్తాయా! ప్రభుత్వానికి ఎంతో ప్రియమైన గ్రూప్ ఖాతాలను ఆడిట్ చేయనని వారు ఎలా తిరస్కరిస్తారు? ఇందులో మరింత సీరియస్ అంశం ఏమిటంటే.. ఇన్వెస్టర్లు జాగ్రత్త పడడమే’’ అని మోయిత్ర ట్వీట్ చేశారు. అదానీ పోర్ట్స్ ఆడిటర్ డెలాయిట్ రాజీనామా చేయనున్నట్టు వచ్చిన వార్తా క్లిప్ ను కూడా ఆమె జోడించారు. డెలాయిట్ రాజీనామా విషయాన్ని బ్లూంబర్గ్ సంస్థ ప్రచురించింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో, షేరు ధరల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. వీటిని అదానీ గ్రూప్ ఖండించింది. ఈ అంశంపై పార్లమెంటులోనూ, బయటా మోయిత్ర తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం.