G. Kishan Reddy: పేదలకు కేసీఆర్ ఇళ్లు కడితే.. కేంద్రం వాటాను తీసుకు వచ్చే బాధ్యత నాదే!: కిషన్ రెడ్డి
- 4 నెలల్లో ప్రగతి భవన్, 8 నెలల్లో సచివాలయం కట్టుకున్నారన్న కిషన్ రెడ్డి
- పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూం విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శ
- కేసీఆర్ పాలనలో పేపర్లపై ఉండే ఇళ్లు భూమ్మీద ఉండవని ఎద్దేవా
ప్రగతి భవన్‌ను నాలుగు నెలల్లో, సచివాలయాన్ని ఎనిమిది నెలల్లో కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇది ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నాను చేపట్టింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ధర్నాలో పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేపర్ల పైనే ఉంటాయని, భూమ్మీద మాత్రం ఉండవని ఎద్దేవా చేశారు.
పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని 2017లో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు కడితే కేంద్రం వాటాను తీసుకు వచ్చే బాధ్యత తనదేనని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నేతలు దోచుకుతింటున్నారని ఆరోపించారు. దళితబంధు పేరుతో దళితులను, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఇక ఎప్పటికీ ఇళ్లు రావన్నారు. ఎన్నికలు ఉన్నందున గృహలక్ష్మి పేరుతో కేసీఆర్ గారడీ చేస్తున్నారన్నారు.