Komatireddy Venkat Reddy: 'తొలి సంతకం దానిపైనే..' అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరిన్ని హామీలు!
- ఏ సర్వే చూసినా కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రజలు చెబుతున్నారన్న ఎంపీ
- బీఆర్ఎస్ విచ్చలవిడిగా భూములను విక్రయిస్తోందని ఆగ్రహం
- ఈ నెల 16, 17 తర్వాత బస్సు యాత్ర చేపడతామని వెల్లడి
- ఉద్యోగాల పారదర్శకత, నోటిఫికేషన్, 24 గంటల విద్యుత్‌పై హామీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఏ సర్వే చూసినా కాంగ్రెస్‌ను గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని ఆ పార్టీ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం రూ.2 లక్షల రుణమాఫీ పైనే అని హామీ ఇచ్చారు. నాలుగు వేల పెన్షన్ కూడా అందిస్తామన్నారు. బీఆర్ఎస్ విచ్చలవిడిగా భూములు అమ్మేస్తోందన్నారు. మద్యం పైనే రూ.50వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోందన్నారు. ఆ డబ్బులన్నీ ఎక్కడకు పోతున్నాయని ప్రశ్నించారు.
ఈ నెల 16, 17 తర్వాత బస్సుయాత్ర మొదలుపెడతామని, తెలంగాణవ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందన్నారు. గ్రూప్ 2 పరీక్షపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారని, పరీక్షను వాయిదా వేయమంటే వేయడం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తామన్నారు.
వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 5 లక్షల మంది టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 24 గంటల కరెంట్ పై ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని, లాగ్ బుక్స్ తో అన్నీ బయటపెట్టానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.