Walking: ‘అడుగు’తో ఆరోగ్యం.. రోజుకు 20 వేల అడుగులతో గుండె జబ్బులు పరార్!
- పోలండ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అధ్యయనం
- నడక మొదలుపెట్టిన తొలి 5 నిమిషాల్లో ఆక్సిజన్ పెరుగుదల
- 10 నిమిషాల తర్వాత తగ్గనున్న రక్తంలో గ్లూకోజ్
- రోజుకు దాదాపు 4 వేల అడుగులతో అకాల మరణాలు దూరం
అదే పనిగా కూర్చుంటే జబ్బులు తప్పవని, నడక ఆరోగ్య ప్రదాయిని అన్న విషయం అందరికీ తెలిసిందే. పోలండ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం మరోమారు నిరూపితం అయింది. శారీరక శ్రమ లేని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
నడిస్తే మంచిదేనని తెలిసినా.. రోజుకు ఎంతసేపు నడవాలన్న దానిపై స్పష్టత లేదు. తాజా అధ్యయనంలో ఈ విషయంలోనూ కొంత క్లారిటీ వచ్చింది. రోజుకు గరిష్ఠంగా 20 వేల అడుగులు వేయడం చాలా మంచిదన్న విషయం వెల్లడైంది. హృదయ సంబంధ జబ్బులకు మందులు అందుబాటులో ఉన్నా సరే.. నడక, ఆహారం, వ్యాయామం కోణంలో జీవనశైలిని క్రమబద్ధీకరించుకోవడం అత్యవసరమని కొసావో యూనివర్సిటీ క్లినికల్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ ఇబెడెటా బైట్‌సీ పేర్కొన్నారు. జీవనశైలి చాలా ముఖ్యమని, ఇది స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుందని పోలండ్‌లోని లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ కార్డియాలజీ ప్రొఫెసర్ మాసియిజ్ బనాజ్ తెలిపారు.
నడక మొదటి 5 నిమిషాలు ఒక దశ అయితే ఇందులో ఆక్సిజన్ పెరుగుతుంది. తర్వాత పది నిమిషాలు రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గిస్తుంది. 20 నిమిషాల తర్వాత ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. రోజుకు 3,967 అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చు. 2,337 అడుగులతో గుండె సంబంధిత జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయి. రోజూ 1000 అడుగులు అదనంగా నడిస్తే గుండెజబ్బుల మరణాలు 15 శాతం తగ్గుతాయి. 500 అడుగులకు పెంచుకోగలిగితే మరణాలు ఏడు శాతం తగ్గించుకోవచ్చు. 60 ఏళ్లు పైబడినవారు రోజుకు 6 వేల అడుగుల నుంచి 10 వేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పును 42 శాతం మేర తగ్గించుకోవచ్చని అధ్యయనం వెల్లడించింది.