Heron Mark-2: చైనా, పాక్ సరిహద్దుల్లో అత్యాధునిక హెరాన్ డ్రోన్లను మోహరించిన భారత్
- సమస్యాత్మకంగా చైనా, పాక్ సరిహద్దులు
- అత్యాధునిక ఆయుధాలను సరిహద్దులకు సమీప స్థావరాలకు తరలిస్తున్న భారత్
- తాజాగా ఇజ్రాయెల్ తయారీ డ్రోన్ల తరలింపు
చైనా, పాకిస్థాన్ దేశాలతో భారత్ సరిహద్దులు ఎంత సమస్యాత్మకమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ప్రత్యర్థి బలగాలు మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చే అవకాశాలున్నాయి. గతంలో పలుమార్లు ఇలాంటి సందర్భాలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో, భారత కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే రాఫెల్ వంటి శత్రు భీకర ఫైటర్ జెట్లను సరిహద్దులకు సమీపంలో ఉండే వాయుసేన స్థావరాలకు తరలించిన రక్షణ శాఖ... తాజాగా చైనా, పాక్ సరిహద్దుల్లో అత్యాధునిక హెరాన్ ఎంకే-2 డ్రోన్లను మోహరించింది.
ఈ మానవ రహిత డ్రోన్లతో బహుళ ప్రయోజనాలున్నాయి. భిన్న లక్ష్యాలపై 24 గంటల పాటు నిఘా వేయడమే కాదు, దాడుల సందర్భంగా యుద్ధ విమానాలకు సహకరిస్తాయి. ఇది యుద్ధ విమానాలకు ఎలా సహకరిస్తుందంటే... ఈ డ్రోన్ నుంచి టార్గెట్ పై ఓ లేజర్ కిరణం పడుతుంది. ఆ కిరణం పడిన టార్గెట్ ను యుద్ధ విమానం సులువుగా గుర్తించి తుత్తునియలు చేస్తుంది.
150 నాట్స్ వేగంతో పయనించే ఈ డ్రోన్లు గరిష్ఠంగా 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు. వీటిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారుచేస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇవి నిరాటంకంగా ప్రయాణిస్తాయి. చూడ్డానికి చిన్న సైజు విమానంలా కనిపించే ఈ హెరాన్ డ్రోన్లు ఒక్కసారి గాల్లోకి లేచాక ఏకబిగిన 36 గంటల పాటు ప్రయాణించగలవు.