Nara Lokesh: కులం, మతం పేరుతో ప్రజా రాజధానిపై ముఖ్యమంత్రి విషం చిమ్మారు: నారా లోకేశ్
- అమరావతి రైతులతో లోకేశ్ ముఖాముఖి
- తాడికొండ నియోజకవర్గం రావెలలో సమావేశం
- లోకేశ్ ఎదుట కన్నీటి పర్యంతమైన అమరావతి మహిళలు, రైతులు
- తీవ్రంగా చలించిపోయిన లోకేశ్
- అధికారంలోకి వచ్చిన మూడేళ్ల లోపు అమరావతి పూర్తిచేస్తామని హామీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 183వ రోజు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. రావెల శివార్లలో అమరావతి ఆవేదన పేరుతో రాజధాని రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశానికి పెద్దఎత్తున రాజధాని రైతులు హాజరై తమ బాధలను చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతుల ఆవేదన విన్న లోకేశ్ తీవ్రంగా చలించిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అమరావతి నిర్మాణం చేసి తీరతామని హామీ ఇచ్చారు.
అమరావతి ఆవేదన కార్యక్రమంలో లోకేశ్ ప్రసంగం హైలైట్స్...
అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం... చేసి చూపిస్తాం
రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే బాధేస్తోంది... పక్కరాష్ట్రాలను చూస్తే అసూయ కలుగుతోంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం చేపడతాం, రైతులకు చెల్లించాల్సిన కౌలు బకాయిలన్నీ చెల్లిస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం, అది చేసి చూపిస్తాం.
కులం, మతం పేరుతో ప్రజా రాజధానిపై ముఖ్యమంత్రి విషం చిమ్మారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన రైతులను తీవ్ర ఇబ్బందుల పాల్జేశారు. అమరావతి రైతులను వేధించిన ఏ ఒక్కరినీ వదలం. వారిపై జ్యుడీషియల్ విచారణ జరిపించి ఉద్యోగాలనుంచి తొలగిస్తాం, అవసరమైతే కటకటాల వెనక్కి కూడా పంపిస్తాం. సైకో పాలన అంతంతోనే మళ్లీ రాష్ట్రానికి గత వైభవం చేకూరి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.
జగన్ మనస్తత్వం తెలుసు కాబట్టే...!
ఆనాడు అమరావతికి జై అన్న జగన్... నేడు కులం, మతం పేరుతో విషం కక్కుతున్నాడు. అసెంబ్లీలో జగన్ ఒకే రాష్ట్రం, ఒకే రాజధానికి జై కొట్టాడు, రాజధానికి 30 వేల ఎకరాలు ఉండాలన్నాడు. అయితే ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి, జగన్ గెలిస్తే రాజధాని ఇక్కడ ఉండదని ఆనాడే చెప్పాం. ఇప్పుడు మూడు ముక్కలాటాడుతున్నారు.
ప్రపంచంలో వెనుకబడిన సౌతాఫ్రికా లాంటి దేశాన్ని జగన్ ఆదర్శంగా తీసుకున్నాడు. ఆ దేశంలో 32 శాతం నిరుద్యోగిత ఉంది. 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించాలి... మూడు రాజధానులన్న వ్యక్తి 3 ఇటుకలైనా వేశాడా? హైకోర్టు విషయానికి వస్తే కనీసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదు. ఇప్పుడు వైజాగ్ ప్రజలను కూడా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోంది.
వైసీపీ అధికారిక ట్విట్టర్ లో రిషికొండపై సచివాలయం కడుతున్నారని చెప్పిన రెండు గంటల్లోనే ఆ ట్వీట్ తొలగించారు. కర్నూలు ప్రజల్ని, అమరావతి రైతులను జగన్ మోసం చేశాడు. విశాఖ ప్రజలు కూడా జగన్ మోసాన్ని గ్రహించాలి.
నేను కూడా సాధ్యం కాదనే అనుకున్నా!
అమరావతి ఏర్పాటు, ప్రజల దగ్గర నుండి భూసేకరణ చేయాలంటే సాధ్యం కాదని నేనూ అనుకున్నా. చంద్రబాబుతో మాట్లాడినప్పుడు... ఒక బిల్డింగ్ కట్టి వదిలేస్తే సైబరాబాద్ తయారయ్యేదా... హైదరాబాద్ మహానగరంగా మారేదా? అన్నారు. వివాదాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడా భూ సమీకరణ జరగలేదు. కానీ ఇక్కడ అందరినీ ఒప్పించి భూమి తీసుకున్నారు. బెంగాల్ లో 600 ఎకరాల సమీకరణకు కాల్పులు జరిగాయి.
చంద్రబాబు సీఎం అయ్యాక రాజధాని రైతులకు పెండింగ్ కౌలు చెల్లిస్తాం. 5 కోట్ల మంది ప్రజలు అమరావతి రైతుల వెనక ఉన్నారు. ఇల్లు కట్టుకోలేదని జె-గ్యాంగ్ అవహేళన చేసినపుడు నేను చంద్రబాబును అడిగాను. రైతులకు న్యాయం చేసిన తర్వాతే భూమి కొందామని చంద్రబాబు చెప్పారు. అదీ ఆయనలో ఉన్న నిబద్ధత.
నేను వేలాది ఎకరాలు కొన్నానని ప్రచారం చేశారు. నేను ఏనాడూ తప్పు చేయలేదు. సింగపూర్ ప్రభుత్వం స్వచ్ఛందంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చింది... వాళ్లను కూడా మెడబట్టి గెంటేశారు.
అమరావతి... ఏవిధంగా కమ్మరావతి?
అమరావతి ప్రజల రాజధాని. ఎక్కువ భాగం ఎస్సీ నియోజకవర్గంలో ఉంటుంది. 6 ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో ఆర్డీఏ విస్తరించి ఉంది. 85 శాతం మంది రైతులకు 2 ఎకరాల లోపు భూమి ఉంది. రాజకీయ లబ్ది కోసం కులం ముద్ర వేశాడు జగన్. కులం ముద్ర వేసి అమరావతిని నాశనం చేశాడు.
ఇప్పుడు రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు అంటూ చిచ్చు పెడుతున్నారు. ఆర్ – 3 జోన్ లో ఇళ్ల స్థలాలకు ఇచ్చే భూమి ఉన్నా... లిటిగేషన్ ఉన్న భూములను ఇవ్వాలని చూస్తున్నారు. కోర్టు కొట్టేయడంతో టీడీపీ పేదలకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. రైతులకు పేదలకు మధ్య చిచ్చుపెడుతున్నారు.
మంగళగిరి వాళ్లకు మంగళగిరిలో, తాడికొండ వాళ్లకు తాడికొండలోనే ఇళ్లు కట్టిస్తాం. ఆర్ – 3 జోన్ లో పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. తాడికొండ, మంగళగిరిలో గెలిచేందుకు ఇళ్ల స్థలాలంటూ డ్రామాలాడుతున్నాడు.
కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే చిచ్చు పెట్టి లాభం పొందాలని చూస్తున్నారు. నిజంగా జగన్ కు పేదలపై ప్రేమ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 52 నెలల్లో కేవలం 6 వేల ఇళ్లు మాత్రమే కడతారా?
3 రాజధానులని ఆనాడే ఎందుకు చెప్పలేదు?
2019 ఎన్నికల సమయంలో మూడు రాజధానులని జగన్ ఎందుకు చెప్పలేదు? అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశాడు. ప్రజావేదికను కూల్చివేతతో పాలన ప్రారంభించాడు. ప్రమాణస్వీకారం చేసిన మొదటి వారం నుండే ఈ సీఎం విధ్వంసం ప్రారంభమైంది.
ఇది అమరావతి ఆవేదన కాదు... ఆంధ్రప్రదేశ్ ఆక్రందన. రాష్ట్ర నడిబొడ్డున అమరావతి ఉంది. 30 వేల ఎకరాలు రాజధానికి కావాలని ఆనాడు జగన్ అన్నాడు. రాజధానిగా అన్ని అర్హతలున్నాయి అమరావతికి. సెంటు స్థలం ఇచ్చేటప్పుడు జగన్ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పాడు. చంద్రబాబు కూడా ఆనాడు రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సంస్థ అని చెప్పాడు.
ఇప్పుడు జగన్ పనైపోయింది. రెండు కిలోమీటర్ల రోడ్డు వేయలేనివాడు 3 రాజధానులు కడతాడా? విశాఖలో 3 ఇటుకలు వేయలేదు... రిషికొండకు గుండుమాత్రం కొట్టించారు. కర్నూలులో హైకోర్టు నిర్మించేందుకు భూమి కూడా సేకరించలేదు.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2453.2 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 11.3 కి.మీ.*
*184వరోజు (14-8-2023) యువగళం వివరాలు*
*తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*
ఉదయం
8.00 – రావెల శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
10.00 – పొన్నెకల్లులో ముస్లిం సామాజికవర్గీయులతో సమావేశం.
11.00 – తాడికొండ అడ్డరోడ్డులో స్థానికులతో సమావేశం.
11.45 – తాడికొండ శివార్లలో ఆడిటర్లతో ముఖాముఖి.
మధ్యాహ్నం
12.45 – తాడికొండ శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – తాడికొండ శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.00 – తాడికొండ ఎన్టీఆర్ సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.
8.00 – కంతేరులో స్థానికులతో సమావేశం.
9.30 – నిడమర్రు శివారు విడిది కేంద్రంలో బస.
******