Tirumala: తిరుమలలో ఎట్టకేలకు చిక్కిన చిరుత
- శుక్రవారం ఆరేళ్ల బాలికను పొట్టనపెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారుల ప్రయత్నం
- ఘటనాస్థలితో పాటూ మరో మూడు ప్రాంతాల్లో బోనుల ఏర్పాటు, సీసీటీవీ కెమెరాతో నిఘా
- సోమవారం తెల్లవారుజామున బోనులో చిక్కుకున్న చిరుత
తిరుమల నడకమార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు సిబ్బంది ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా, తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలురాయి వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కింది.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కాలినడక మార్గంలో తిరుమలకు వెళుతుండగా అకస్మాత్తుగా చిరుత బాలికపై దాడి చేసింది. తల్లిదండ్రుల కంటే ముందు వెళుతున్న బాలికపై రాత్రి వేళ దాడి చేసిన చిరుత ఆ తరువాత పొదల్లోకి చిన్నారిని ఈడ్చుకెళ్లి చంపి తినేసింది. మరుసటి రోజు ఉదయం బాలిక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగడంతో తిరుమల అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత మెట్లమార్గంలో చిన్నారులను అనుమతించకూడదని, వంద మంది భక్తుల చొప్పున ఓ బృందంగా భద్రత ఏర్పాట్ల నడుమ కాలినడక మార్గంలో అనుమతించాలని నిర్ణయించారు.