YS Avinash Reddy: సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ అవినాశ్ రెడ్డి
- కోర్టుకు హాజరు కావాలంటూ అవినాశ్ కు గత నెలలో సమన్లు
- అప్రూవర్ దస్తగిరి మినహా అందరూ కోర్టుకు హాజరు
- తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టుకు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ఈరోజు (ఆగస్ట్ 14) విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు గత నెల సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలపై సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో 145 పేజీల అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఈనాటి కోర్టు విచారణకు అప్రూవర్ గా మారిన ఏ4 దస్తగిరి మినహా మిగిలిన అందరూ హాజరయ్యారు. చంచల్ గూడ జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లను కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. వీరందరి కంటే ముందు కోర్టుకు అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. అప్పటికి మిగిలిన నిందితులు కోర్టుకు చేరుకోకపోవడంతో విచారణను కోర్టు కాసేపు వాయిదా వేసింది. అందరూ వచ్చిన తర్వాత విచారణను ప్రారంభించిన సీబీఐ కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.