ISRO: ఇక గురి సూర్యుడిపైనే.. ‘ఆదిత్య ఎల్–1’తో సిద్ధమవుతున్న ఇస్రో!
- ‘ఆదిత్య ఎల్–1’ ఫొటోలను ట్వీట్ చేసిన ఇస్రో
- లాంచింగ్‌కు సిద్ధమవుతున్నట్లు వెల్లడి
- బెంగళూరు నుంచి శాటిలైట్ శ్రీహరికోటకు చేరుకుందని ప్రకటన
- సెప్టెంబర్ తొలి వారంలో ప్రయోగం చేపట్టే అవకాశం
అంతరిక్ష ప్రయోగాల్లో ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ సాగుతోంది ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ). 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును సాధించింది. ఇటీవల చేపట్టిన చంద్రయాన్–3తో తన లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడు సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమవుతోంది.
తొలిసారిగా సూర్యుడిపై అధ్యయనం కోసం ‘ఆదిత్య ఎల్–1’ మిషన్‌ను చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని ఈ రోజు ప్రకటించింది. ఆదిత్య ఎల్–1 మిషన్‌కు చెందిన ఫొటోలను ఇస్రో ట్వీట్ చేసింది. ‘‘ఆదిత్య ఎల్–1 లాంచింగ్‌కు సిద్ధమవుతోంది” అని రాసుకొచ్చింది. బెంగళూరులో తయారైన శాటిలైట్ ఇప్పుడు శ్రీహరికోటకు చేరుకుందని తెలిపింది.
ఈ ప్రయోగంలో భాగంగా సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. సౌర తుపాన్ల సమయంలో జరిగే మార్పులపై స్టడీ చేయనున్నారు. సూర్యుడి ఉపరితలాన్ని కూడా అధ్యయనం చేయనున్నారు. ఈ వ్యోమనౌక బరువు సుమారు 1,500 కిలోలు ఉంటుంది. ఆదిత్య ఎల్–1లో మొత్తం ఏడు పేలోడ్లు వుంటాయి. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. సెప్టెంబర్ తొలి వారంలో ఆదిత్య ఎల్–1ను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
సూర్యుడు–భూమి వ్యవస్థలో ఉన్న ఓ కక్ష్యలో శాటిలైట్‌ను ప్రవేశపెడుతారు. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం వల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది.