Telangana High Court: టీచర్ల బదిలీలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా

Teachers Transfers issue in Telangana High Court adjourned
  • టీచర్ల బదిలీల అంశంపై నేడు హైకోర్టులో విచారణ
  • టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా అని ప్రశ్నించిన న్యాయస్థానం
  • ఏ ప్రాతిపదికన టీచర్ల మధ్య వివక్ష చూపిస్తున్నారన్న జడ్జి
  • ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్
టీచర్ల బదిలీల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా? అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఏ అధికారంతో, ఏ ప్రాతిపదికన టీచర్ల మధ్య వివక్ష చూపిస్తున్నారని సూటిగా ప్రశ్నించింది. అనంతరం ప్రభుత్వ వాదనలు కూడా విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. 

ఇవాళ్టి విచారణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. భార్యాభర్తలు ఉపాధ్యాయులుగా పనిచేస్తుంటే, వారిద్దరూ ఒకేచోట ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కోర్టుకు విన్నవించారు. బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇస్తున్నామని తెలిపారు. స్టే కారణంగా బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని వెల్లడించారు. 

బదిలీ ప్రక్రియ నిబంధనలను సవరించామని, ప్రస్తుతం ఆ అంశం అసెంబ్లీ కౌన్సిల్ పరిశీలనలో ఉందని అడ్వొకేట్ జనరల్ వివరించారు. ఈ మేరకు కోర్టుకు మెమో సమర్పించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున టీచర్ల బదిలీలపై త్వరగా తీర్పు వెలువరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.  

అటు, పిటిషనర్లు స్పందిస్తూ... తమకు కొంత సమయం కావాలని కోరారు.
Telangana High Court
Teachers
Transfers
Telangana

More Telugu News