Shivraj Singh Chouhan: ముందు మీ అవినీతి గురించి చూసుకోండి.. కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ సీఎం ఫైర్

MP CM Shivraj Singh Chouhan Fire On Telangana CM KCR
  • కేసీఆర్ విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారన్న శివరాజ్‌సింగ్ చౌహాన్
  • అవినీతికి తెలంగాణ దేశంలోనే ఫేమస్ అని ఆరోపణ
  • ఏపీలోని వలంటీర్ వ్యవస్థతో ప్రమాదమన్న మధ్యప్రదేశ్ సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తమ రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడే ముందు తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి చూసుకోవాలని సూచించారు. భోపాల్‌లోని తన అధికారిక నివాసంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ ఆయనీ విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీఆర్ఎస్ పోటీ చేస్తే స్వాగతిస్తామన్నారు. కేసీఆర్ విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని, దేశంలోనే అవినీతికి తెలంగాణ కేరాఫ్ అయిందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ వలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు వలంటీరు పోస్టు ఇస్తే వారు పార్టీ కోసమే పనిచేస్తారని పేర్కొన్నారు. దానివల్ల అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పారదర్శక విధానంలో పెన్షన్ అందించడమే మంచిదని  తెలిపారు. 

రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న ‘ముఖ్యమంత్రి లాడ్లీ లక్ష్మి’ పథకంలో మహిళలు సంతోషంగా ఉన్నారని, 21 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు తాము నెలకు రూ. 1000 ఇస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బును మహిళలు కూడబెట్టుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ తమ  కాళ్లపై తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ఈ పథకం కింద ఇస్తున్న సొమ్మును దశల వారీగా రూ. 3 వేలకు పెంచుతామని తెలిపారు.
Shivraj Singh Chouhan
Madhya Pradesh
Telangana
KCR
Andhra Pradesh

More Telugu News