Vanindu Hasaranga: టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగ... కారణం ఇదే!

Sri Lanka all rounder Vanindu  Hasaranga retires from Test cricket

  • శ్రీలంక వన్డే, టీ20 జట్లలో కీలక ఆటగాడిగా వనిందు హసరంగ
  • హసరంగ వయసు 26 ఏళ్లు
  • టెస్టు క్రికెట్ కు వీడ్కోలు
  • ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగనున్న హసరంగ
  • హసరంగ నిర్ణయానికి ఆమోదం తెలిసిన శ్రీలంక క్రికెట్ బోర్డు

శ్రీలంక స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మరికొంత కాలం పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. హసరంగ వయసు కేవలం 26 ఏళ్లే. 

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఫ్రాంచైజీ లీగ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల అమెరికాలోనూ మేజర్ లీగ్ క్రికెట్ పేరిట ఘనంగా టోర్నీ నిర్వహించారు. దాదాపు ఐసీసీ సభ్య దేశాలన్నింటిలో టీ20 లీగ్ లు నడుస్తున్నాయి. వీటిల్లో పాల్గొంటే బాగా ఆర్జించే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో హసరంగ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించడంలేదు. 

హసరంగ 2020 డిసెంబరులో దక్షిణాఫ్రికాతో సిరీస్ ద్వారా టెస్టు క్రికెట్ గడప తొక్కాడు. అప్పటినుంచి అతడు ఆడింది 4 టెస్టులే. చివరిసారిగా హసరంగ టెస్టు ఆడింది 2021 ఏప్రిల్ లో. 

అయితే, వన్డేలు, టీ20 ల్లో హసరంగ లేకుండా లంక జట్టు బరిలో దిగింది చాలా తక్కువ. ఈ రెండు ఫార్మాట్లలో అతడు నమ్మకమైన స్పిన్నర్ గా, హార్డ్ హిట్టర్ గా పేరుపొందాడు. టెస్టు క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్న విషయాన్ని హసరంగ ఇవాళ శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలియజేశాడు. బోర్డు అతడి నిర్ణయాన్ని వెంటనే ఆమోదించింది. 

దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా స్పందిస్తూ, హసరంగ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపాడు. అయితే, వైట్ బాల్ క్రికెట్ లో అతడు శ్రీలంక క్రికెట్ జట్టు భవిష్యత్ కార్యాచరణలో కీలక భాగం అని నమ్ముతున్నామని పేర్కొన్నాడు. 

హసరంగ ఇప్పటివరకు శ్రీలంక తరఫున 48 వన్డేల్లో, 58 టీ20 అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 158 వికెట్లు తన ఖాతాలో వేసుకుని, 1366 పరుగులు కూడా సాధించాడు. 

ఇటీవల జింబాబ్వేలో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో శ్రీలంక జట్టు అజేయంగా నిలిచి, వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో హసరంగ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో హసరంగ 22 వికెట్లు పడగొట్టడం అతడి సత్తాకు నిదర్శనం.

  • Loading...

More Telugu News