India: చుషుల్-మోల్డోలో భారత్-చైనా మధ్య 19వ రౌండ్ సమావేశాలు
- సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉన్నతాధికారుల మధ్య చర్చలు
- సానుకూల వాతావరణం కనిపించిందన్న భారత విదేశాంగ శాఖ
- 13, 14 తేదీల్లో చర్చలు జరిగాయని వెల్లడి
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ - చైనా ఉన్నతాధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా 19వ రౌండ్ చర్చలు జరిగాయి. ఈ చర్చలో సానుకూల వాతావరణం కనిపించిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరుదేశాలు తమ తమ అభిప్రాయాలు బహిరంగంగా పంచుకోవడంతో పాటు మరిన్ని చర్చలకు అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది.
చుషుల్-మోల్డో సరిహద్దు ప్రాంతంలో భారత్ - చైనా కార్ప్స్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13, 14 తేదీల్లో చర్చలు జరిగాయని వెల్లడించింది.
ఇరుదేశాల అగ్రనాయకత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారులు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపింది. మిగతా సమస్యలను క్రమంగా పరిష్కరించుకోవడం, ఇందుకు సైనిక, దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. ఈ సమయంలో సరిహద్దులో శాంతిని కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించినట్లు తెలిపింది.