Kerala: అంధుడైన టీచర్‌ను టీజ్ చేసిన విద్యార్థుల సస్పెన్షన్

Teacher who ridiculed blind teacher suspended in kerala ernakulam

  • కేరళలోని ఎర్నాకుళంలో గల మహారాజా ప్రభుత్వ పాఠశాలలో ఘటన
  • పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడి చుట్టూ చేరి విద్యార్థుల హేళన
  • ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పంచుకున్న వైనం, వెల్లువెత్తిన విమర్శలు
  • స్కూల్ యాజమాన్యానికి విషయం తెలిసి విద్యార్థులపై సస్పెన్షన్
  • సమస్యను తమలో తామే పరిష్కరించుకుంటామన్న బాధిత ఉపాధ్యాయుడు

కేరళలో కొందరు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. ఉపాధ్యాయుడు అంధుడని కూడా చూడకుండా అవహేళన చేసి, ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. విషయం స్కూల్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో చివరకు వారందరూ సస్పెండ్ అయ్యారు. 

ఎర్నాకుళంలోని మహారాజా ప్రభుత్వ పాఠశాలలో బాధిత అధ్యాపకుడు రాజనీతి శాస్త్రం బోధిస్తుంటారు. ఆయనకు చూపు లేదు. అదే కాలేజీలో చదువుకున్న ఆయన చివరకు అక్కడ ఉపాధ్యాయుడిగా ఎదిగారు. అయితే, ఇటీవల ఆయనకు క్లాస్ రూంలో దారుణ అనుభవం ఎదురైంది. పాఠం చెబుతుండగా ఆయనను కొందరు విద్యార్థులు చుట్టుముట్టి టీజ్ చేయడం ప్రారంభించారు. కనీస మానవత్వం కూడా లేకుండా ఉపాధ్యాయుడికి చూపు లేదంటూ ఘోరంగా అవమానించారు. ఇది చాలదన్నట్టు ఈ దారుణ దృశ్యాల్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, విద్యార్థులపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. 

మరోవైపు, ఈ ఘటన స్కూల్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వారు ఈ ఘటనకు బాధ్యులైన ఆరుగురు స్టూడెంట్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై బాధిత ఉపాధ్యాయుడు కూడా స్పందించారు. ‘‘వారికి ఓ గంట సేపు క్లాస్ చెప్పేందుకు రెండు గంటల పాటు సిద్ధమై వచ్చా. ఈ వీడియో నా స్నేహితులు, బంధువులను ఎంతో బాధించింది. అయితే, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సమస్యను కళాశాల పరిధిలోనే పరిష్కరించుకుంటాం’’ అని అధ్యాపకుడు తన దొడ్డ మనసు చాటుకున్నారు.

  • Loading...

More Telugu News