Shiv Sena Telangana: మహారాష్ట్రలో బీఆర్ఎస్ చేసేదేమీ లేదు.. తెలంగాణలో మా సత్తా ఏంటో బీఆర్ఎస్ కు చూపిస్తాం: శివసేన
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించిన శివసేన
- సరిహద్దు నియోజకవర్గాలపై దృష్టిసారించామన్న శివసేన తెలంగాణ అధ్యక్షుడు
- హైదరాబాద్ లో జరిగే సభకు ఏక్ నాథ్ షిండే హాజరవుతారని వెల్లడి
బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకలాపాలను మహారాష్ట్రకు విస్తరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ సంచలన ప్రకటన చేసింది. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ప్రకటించింది. తెలంగాణలో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ వెల్లడించారు.
మహారాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లోని నియోజకవర్గాలపై దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎంలు రహస్య మిత్రులని... వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు శివసేన సత్తా ఏమిటో రుచి చూపిస్తామని అన్నారు. హైదరాబాద్ లో శివసేన బహిరంగసభను నిర్వహించబోతున్నామని... ఈ సభకు ఏక్ నాథ్ షిండే హాజరవుతారని తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఏ మాత్రం ఉండదని శివాజీ అన్నారు. ఇదే సమయంలో తెలంగాణపై శివసేన ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుందని చెప్పారు.