New Delhi: ఢిల్లీలో నెహ్రూ పేరిట ఉన్న మ్యూజియం పేరు మార్పు
- నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రెరీ సొసైటీగా మార్పు
- సోషల్ మీడియాలో వెల్లడించిన మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్
- ప్రజాస్వామీకరణలో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు వెల్లడి
దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రముఖ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రెరీ పేరును కేంద్రం తాజాగా మార్చింది. మ్యూజియం కొత్త పేరు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రెరీ సొసైటీగా ఖరారు చేసింది. ఈ మేరకు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్ నృపేంద్ర మిశ్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పేరును అధికారికంగా మార్చారు. ప్రజాస్వామీకరణ క్రతువులో భాగంగా ఈ మార్పు చేసినట్టు నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.
సొసైటీ వైస్ ప్రెసిడెంట్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జూన్లో జరిగిన ఓ సమావేశంలో పేరుమార్పు నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొన్ని విధానపరమైన లాంఛనాలు పూర్తి చేసేందుకు కొంత సమయం పట్టిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14 నుంచి కొత్త పేరు అమల్లోకి రావాలని అప్పట్లో మ్యూజియం అధికారులు నిర్ణయించారు.