BJP: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రైల్వే పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.3,238 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ పనులకు ఆమోదం
- డోన్-మహబూబ్ నగర్, మేడ్చల్-ముద్ఖేడ్ మధ్య డబ్లింగ్ పనులు
- బారాంగ్, కుర్దారోడ్ -విజయనగరం వరకు మూడో లైన్‌కు ఆమోదముద్ర
రైల్వే లైన్ విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం కోసం ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ట్రాలలో ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు సంబంధించి... గుంటూరు - బీబీ నగర్ డబ్లింగ్ సహా వివిధ పనులకు ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్ పనులను రూ.3,238.38 కోట్ల అంచనా వ్యయంతో 272.69 కిలో మీటర్ల మేర చేయనుంది.
దీంతో పాటు రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో డోన్-మహబూబ్ నగర్, మేడ్చల్-ముద్ఖేడ్ మధ్య డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. రూ.417.6 కిలో మీటర్ల మేర రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో బారాంగ్, కుర్దా రోడ్ - విజయనగరం వరకు రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైన్‌కు ఆమోద ముద్ర వేసింది. మొత్తం రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో యూపీ, బీహార్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్ వర్క్‌ను విస్తరించనుంది.