Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత!
- లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుత
- రోజుల వ్యవధిలోనే పట్టుబడ్డ రెండో చిరుత
- చిరుతలను బంధించేందుకు కొనసాగుతున్న అధికారుల ప్రయత్నాలు
తిరుమలలో చిరుతల కలకలం సద్దుమణగట్లేదు. ఇవాళ మరో చిరుత బోనులో చిక్కింది. తిరుపతి మెట్ల మార్గంలో గత శుక్రవారం లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో, ఆ చిరుతను బంధించేందుకు అధికారులు దాడి జరిగిన పరిసరాల్లో బోనులు ఏర్పాటు చేయగా మరుసటి రోజే ఓ చిరుత చిక్కింది. ఆ తరువాత కొన్ని రోజులకే నేడు మరో చిరుత అధికారులకు చిక్కింది.
తిరుమలలో పలు చిరుతలు సంచరిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వాటిని పట్టుకునేందుకు అధికారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో, ఈ తెల్లవారుజామున మరో చిరుత చిక్కింది.
కాగా, మెట్లమార్గంలో భక్తులకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలన్న సూచన అమలు చేయడం కుదరదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చిరుతల స్వేచ్ఛా సంచారానికి కంచె ఏర్పాటుతో అడ్డంకి సృష్టించినట్టు అవుతుందని వివరించారు. చిరుతలన్నీ పెద్దవే కావడంతో కంచెను దాటి కూడా అవి దాడి చేయగలవని చెప్పారు.