Times Now Election Survey: కేంద్రంలో మళ్లీ మోదీనే.. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఎన్డీయే ఘన విజయం: టైమ్స్ నౌ తాజా సర్వే
- ఎన్డీయే కూటమికి 296 నుంచి 326 సీట్లు వస్తాయన్న సర్వే
- 160 నుంచి 190 సీట్లకు పరిమితం కానున్న ఇండియా కూటమి
- ఎన్డీయేకు 42.60 శాతం ఓట్లు... ఇండియా కూటమికి 40.20 శాతం ఓట్లు వస్తాయని అంచనా
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ జరిపిన సర్వే ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. దేశంలో ప్రధాని మోదీ హవా ఏమాత్రం తగ్గలేదని సర్వే స్పష్టం చేస్తోంది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలను నిర్వహిస్తే ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని... మోదీ వరుసగా మూడో సారి ప్రధాని కావడం ఖాయమని సర్వే తెలిపింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గాను ఎన్డీయే కూటమికి 296 నుంచి 326 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. విపక్ష పార్టీల ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది.
అధికార, విపక్ష కూటముల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లను గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ సొంతంగా 62 నుంచి 80 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే రెండు కూటమిలకు మధ్య ఓట్ల శాతంలో తేడా మాత్రం చాలా తక్కువగానే ఉండబోతోందని పేర్కొంది. ఎన్డీయేకు 42.60 శాతం ఓట్లు, ఇండియా కూటమికి 40.20 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.