Bhanuprakash Reddy: తిరుమల నడక దారిలో చిరుతలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?: భానుప్రకాశ్ రెడ్డి
- టీటీడీ చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్న భాను ప్రకాశ్ రెడ్డి
- నెలన్నర కాలంలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్న
- ఎర్రచందనం స్మగ్లర్ల వల్ల చిరుతలు జనావాసాల వైపు వస్తున్నాయని వ్యాఖ్య
తిరుమల నడక దారిలో చిరుతలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక చిన్నారిని చిరుత పొట్టనపెట్టుకుంది. ఈ క్రమంలో టీడీపీ భద్రతా చర్యలను చేపట్టింది. కొండపైకి వెళ్లే భక్తులకు కర్రలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీపై విమర్శలు గుప్పించారు. టీటీడీ చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. పులి, కర్ర అంటూ భక్తులను భయపెడుతున్నారని అన్నారు. నడక దారిలో వెళ్లే భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత టీటీడీదే అని చెప్పారు. గత ఒకటిన్నర నెలలుగా టీటీడీ తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ వ్యవహరిస్తోందని చెప్పారు.
ఇంత జరుగుతున్నా ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ కానీ, మంత్రులు కానీ ఎందుకు స్పందించడం లేదని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లర్ల వల్లే చిరుతలు అడవిలో నుంచి జనావాసాల వైపు వస్తున్నాయని అన్నారు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపితే అధికార పార్టీ నేతల పేర్లు చాలా బయటకు వస్తాయని చెప్పారు. కొందరు నాయకులు, అధికారులకు కోట్లాది రూపాయలు వెళ్తున్నాయని అన్నారు.