CHVMM Krishna Rao: సీనియర్ జర్నలిస్ట్ 'కృష్ణారావు బాబాయ్' మృతి పట్ల చంద్రబాబు స్పందన
- కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న కృష్ణారావు
- నేడు తుదిశ్వాస విడిచిన వైనం
- దిగ్భ్రాంతికి గురయ్యానన్న చంద్రబాబు
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూయడంతో తెలుగు పాత్రికేయ రంగంలో విషాదం నెలకొంది. కృష్ణారావు క్యాన్సర్ తో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
ఆయన 70వ దశకంలో పత్రికా రంగంలో ప్రవేశించి తెలుగు, ఆంగ్ల మీడియా సంస్థల్లో పనిచేశారు. కంట్రిబ్యూటర్ గా జర్నలిస్ట్ ప్రస్థానం ప్రారంభించిన సీహెచ్ వీఎం కృష్ణారావు వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఆయనను ఇతర జర్నలిస్టులు 'కృష్ణారావు బాబాయ్' అని పిలుచుకుంటారు. దాంతో పాత్రికేయ రంగంలో ఆయనకు ఆ పేరే స్థిరపడిపోయింది.
కాగా, కృష్ణారావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పాత్రికేయులందరూ కృష్ణారావు బాబాయ్ అని పిలుచుకునే సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు గారి మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. నికార్సయిన జర్నలిస్టుగా, పక్షపాత ధోరణి చూపని రాజకీయ విశ్లేషకునిగా కృష్ణారావు ఎంతో పేరు పొందారని చంద్రబాబు కీర్తించారు.
"ఆయనతో నా ఆత్మీయ అనుబంధం సుదీర్ఘమైనది. కృష్ణారావు గారి మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.