Chhattisgarh: ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సరికొత్త ప్రణాళిక.. ఏ, బీ, సీ, డీ స్ట్రాటజీ!
- ఏ కేటగిరీలో బీజేపీ గెలిచిన స్థానాలు
- బీ కేటగిరీలో గెలిచిన లేదా ఓడిన స్థానాలు
- సీ కేటగిరీలో రెండు సార్లు ఓడిన స్థానాలు
- డీ కేటగిరీలో ఒక్కసారి కూడా గెలవని స్థానాలు
త్వరలోనే ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణలతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధమైన ప్రణాళికలను బీజేపీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ కు సరికొత్త స్ట్రాటజీని హైకమాండ్ సిద్ధం చేసింది. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న స్థానాల్లో మరింత ఎక్కువ దృష్టి సారించాలని నిర్ణయించింది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన పార్టీ ఎలెక్షన్ కమిటీ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరయ్యారు.
సగానికి పైగా స్థానాలను కొత్త అభ్యర్థులకు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. కులం, స్థానిక సమస్యలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నిన్నటి ఎలెక్షన్ కమిటీ సమావేశంలో ఛత్తీస్ గఢ్ లోని 90 సీట్లలో 27 సీట్లపై చర్చించారు. ఈ సీట్లను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు కేటగిరీలుగా విడదీశారు. 2018 ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలను ఏ కేటగిరీలో చేర్చారు. బీజేపీ గెలిచిన లేదా ఓడిన స్థానాలను బీ కేటగిరీలో, మిగిలిన స్థానాలను సీ, డీ కేటగిరీలో ఉంచారు. సీ, డీ కేటగిరీల్లోని స్థానాలు బీజేపీకి అత్యంత క్లిష్టమైనవి. రెండు సార్లు ఓడిపోయిన స్థానాలను సీ కేటగిరీలో, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేని స్థానాలను డీ కేటగిరీలో చేర్చారు.