YS Sharmila: రూ.1100 కోట్ల భూమిని రూ.3.41 కోట్లకే కేసీఆర్ దోచేశారు: వైఎస్ షర్మిల
- కేసీఆర్ భూబకాసురుడని మండిపడిన షర్మిల
- కావాల్సింది కాజేయడం... ఆదాయం కోసం అమ్మేయడమే కేసీఆర్ దందా అని ధ్వజం
- ఎకరం రూ.100 కోట్లు పలికిన చోట 33 ఎకరాలను రూ.3 కోట్లకే తీసుకున్నారని ఆరోపణ
- కోర్టు మొట్టికాయలు వేసినా, జనం దుమ్మెత్తిపోసినా దొరగారిలో మార్పులేదని ఎద్దేవా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భూబకాసురుడని, అడిగేవారు లేరని ప్రభుత్వ భూములపై దొర ఇష్టారాజ్యం నడుస్తోందని విమర్శించారు. కావాల్సింది కాజేయడం.. ఆదాయం కోసం అమ్మేయడం ఇది కేసీఆర్ వచ్చినప్పటి నుండి నడుస్తోన్న దందా అన్నారు. తనకు నచ్చిన ధరకు కబ్జాలు చేస్తూ ప్రజలకు మాత్రం కాంపిటీషన్ పెడుతున్నారని ధ్వజమెత్తారు.
జిల్లాల్లో పార్టీ కార్యాలయల పేరిట రూ.1000 కోట్ల విలువ చేసే 33.72 ఎకరాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో దొర గారి భారతీయ భవన్ కోసం పదకొండు ఎకరాలను రూ.3.41 కోట్లకే దోచేశారన్నారు. రూ.1,100 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా పార్టీ కార్యాలయానికి లాక్కున్నారన్నారు. ప్రభుత్వ పనులకు పనికొచ్చే భూములన్నీ దొరగారి సొంత పార్టీ అవసరాలకు, ఆయన బినామీలకు ఉపయోగపడుతున్నాయని మండిపడ్డారు. కోర్టు మొట్టికాయలు వేసినా, జనం దుమ్మెత్తిపోసినా తుడుచుకొని వెళ్తున్నారన్నారు.
ఇంత జరిగినా దొరగారిలో మార్పు లేదన్నారు. కేసీఆర్ పార్టీ కోసం రాయించుకున్న అత్యంత విలువైన కోకాపేట భూములను వెంటనే ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎకరం రూ.100 కోట్ల లెక్కించి మీ పార్టీ ఖాతాలో మూలుగుతున్న రూ.12 వందల కోట్లలో రూ.1,100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలన్నారు.