malla rajireddy: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత!
- అనారోగ్యంతో బాధపడుతూ రాజిరెడ్డి చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటన
- ఆయన మృతిని ధ్రువీకరించిన చత్తీస్‌గఢ్ పోలీసులు
- గతంలో రాజిరెడ్డిపై రూ.కోటి నజరానా ప్రకటించిన చత్తీస్‌గఢ్ సర్కారు
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ దండకారణ్యంలో చనిపోయారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట ఏరియా ఉసూరు బ్లాక్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన రిలీజ్ చేసింది. రాజిరెడ్డి మృతిని చత్తీస్‌గఢ్ పోలీసులు కూడా ధ్రువీకరించారు.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో ఒకరు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టు నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్చార్జ్గా ఆయన పని చేశారు. రాజిరెడ్డిపై చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించడం గమనార్హం. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, ఆలోక్, సత్తెన్న వంటి పేర్లు రాజిరెడ్డికి ఉన్నాయి.