Telangana: హైదరాబాద్ ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు.. వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సన్నాహాలు!
- వచ్చే నెలలో మెట్రో రైల్‌తో పాటూ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు పనుల ప్రారంభం
- టీఎస్ఐఐసీ, ఎఫ్ఏసీ వీసీ, ఎండీ ఈ.వెంకట్ నరసింహరెడ్డి వెల్లడి
- హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో హిమ్టెక్స్, ఐపీఈసీ ఎక్స్ పో ప్రారంభించిన వెంకట్ రెడ్డి
- రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన వైనం
హైదరాబాద్ మహానగరంలో మరో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కానుంది. నగరానికి మరో ఎయిర్ పోర్టు అవసరముందని, సిటీకి ఉత్తరాన ఏర్పాటు చేయబోయే ఈ కొత్త ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు పనులు వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరగుతున్నాయని టీఎస్ఐఐసీ, ఎఫ్ఏసీ వీసీ, ఎండీ ఈ. వెంకట్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన హిమ్టెక్స్, ఐపీఈసీ ఎక్స్పో షోకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.
హైదరాబాద్‌లో మెట్రో రైల్‌తో పాటు ఉత్తరాన ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరగుతున్నాయని వెంకట్ నరసింహారెడ్డి తెలిపారు. రానున్న మూడేళ్లల్లో తెలంగాణ రూపురేఖలు సమూలంగా మారిపోతాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రహదారుల విస్తరణతో పాటూ లింకు రోడ్లను కలుపుకుని రీజినల్ రింగ్ రోడ్డు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎక్స్‌పోలో మెషినరీ, పరికరాల తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఫార్మా, కెమికల్స్, బయో టెక్నాలజీ, ఫుడ్, ఆగ్రో ప్రాసెసింగ్, పెట్రో కెమికల్స్, మినరల్స్, పవర్, స్టీల్ వంటి పరిశ్రమల నూతన ఆవిష్కరణలు ప్రదర్శించనున్నారు.