Nara Lokesh: వృద్ధురాలి మక్కా యాత్రకు రూ.1.50 లక్షల సాయం చేసి.. మాట నిలబెట్టుకున్న లోకేశ్
- యువగళం పాదయాత్రలో వృద్ధురాలికి హామీ ఇచ్చిన లోకేశ్
- టికెట్లకు రూ. లక్ష.. ఖర్చుకు రూ. 50 వేలు కలిపి రూ. 1.50 లక్షల చెక్ పంపిన టీడీపీ నేత
- హుసేన్‌బీకి చెక్ అందించిన నాయకులు
మక్కా యాత్ర చేయాలన్న ఓ వృద్ధురాలి కోరికను తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ నెరవేర్చారు. యాత్ర కోసం ఆమెకు రూ. 1.50 లక్షలు అందించారు. దీంతో ఆ వృద్ధురాలి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. యువగళం పాదయాత్రలో భాగంగా మే 15న లోకేశ్ నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలోని పార్నపల్లె చేరుకున్నారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు హుసేన్‌బీని పలకరించారు. ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హుసేన్‌బీ మాట్లాడుతూ.. మక్కా యాత్ర చేయాలన్న కోరిక అలాగే మిగిలిపోయిందని, సాయం చేయాలని కోరారు. దీనికి ఆయన సరేనని హామీ ఇచ్చారు. మక్కా వెళ్లి వచ్చేందుకు అవసరమైన సాయం అందిస్తానని మాటిచ్చారు. అనుకున్నట్టే తాజాగా ఆమె ఉమ్రా యాత్రకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా టికెట్ల కోసం రూ. లక్ష, ఖర్చులకు రూ. 50 వేలు కలిపి మొత్తంగా రూ.1.50 లక్షల చెక్ పంపించారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ నిన్న ఆ చెక్‌ను హుసేన్‌బీకి అందించారు.