Hyderabad Cricket Association: హైదరాబాద్ లో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లపై సందిగ్ధత.. భద్రతా ఆందోళనలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లో మార్పులు చేయాలని వినతి
- అక్టోబర్ 9న రాజీవ్ గాంధీ స్టేడియంలో నెదర్లాండ్స్-న్యూజిలాండ్ మ్యాచ్
- 10వ తేదీన పాక్-శ్రీలంక మధ్య మ్యాచ్
- భద్రత కల్పించడం కష్టమన్న పోలీసులు
వన్డే వరల్డ్ కప్ విషయంలో మరో చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా పలు పర్యాయాలు షెడ్యూల్ లో మార్పులు చేయగా, ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) మరో విడత షెడ్యూల్ లో మార్పులు చేయాలని కోరుతోంది.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 9న నెదర్లాండ్స్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం మరుసటి రోజు అంటే అక్టోబర్ 10న.. అదే స్టేడియంలో శ్రీలంక, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. ఇలా వెంట వెంటనే వరుస రోజుల్లో మ్యాచ్ లు నిర్వహించడం సాధ్యం కాదని హెచ్ సీఏ తాజాగా బీసీసీఐకి తెలియజేసింది.
సరిగ్గా వారం క్రితమే ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లో 9 మార్పులు చేయడం గమనార్హం. లీగ్ దశలో మొత్తం 45 మ్యాచ్ లకు గాను మూడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. అక్టోబర్ 14న పాకిస్థాన్ - భారత్ మధ్య కీలక మ్యాచ్ ఉంది. దీనికి ముందు పాకిస్థాన్ జట్టుకు కొంత విరామం ఉండాలన్న ఉద్దేశ్యంతో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ ను అక్టోబర్ 12 నుంచి 10కి మార్చారు. దీంతో రాజీవ్ గాంధీ స్టేడియంలో వరుస రోజుల్లో మ్యాచ్ లు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది.
వరుస రోజుల్లో మ్యాచ్ లు ఉండడంతో పోలీసుల నుంచి భద్రతాపరమైన ఆందోళన వ్యక్తమైనట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ మ్యాచ్ కు భద్రత కల్పించడం కష్టమని పోలీసులు చెప్పినట్టు సమాచారం. పాక్ క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద 3,000 మంది పోలీసులను నియమించాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో మ్యాచ్ ల మధ్య విరామం ఉండేలా షెడ్యూల్ లో మార్పులు చేయాలని బీసీసీఐని హెచ్ సీఏ కోరింది.