IPL 2024: మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన లసిత్ మలింగ
- ముంబై ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా లంక దిగ్గజం
- షేన్ బాండ్ స్థానంలో నియామకం
- ముంబై తరఫున నాలుగు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన మలింగ
శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే బౌలర్‌గా కాదు. బౌలింగ్ కోచ్‌గా కొత్త పాత్రలో వచ్చాడు. వచ్చే సీజన్ కోసం ముంబై ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మలింగ నియమితుడయ్యాడు. గత తొమ్మిదేళ్లుగా ముంబైకి సేవలందించిన షేన్ బాండ్ స్థానంలో మలింగ బాధ్యతలు చేపట్టనున్నాడు. ముంబై కోచింగ్ స్టాఫ్ లో పని చేయడం మలింగకు ఇది రెండోసారి కానుంది. 2018 సీజన్లో ఆ టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు.
కానీ, ఆ తర్వాతి ఏడాది తిరిగి మైదానంలోకి వచ్చి బౌలింగ్ బాధ్యతలు పంచుకున్నాడు. 2019లో ముంబై ఐపీఎల్లో నాలుగోసారి విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ముంబై తరఫున అతను నాలుగు ఐపీఎల్ (2013, 15, 17, 19) టైటిల్స్, ఒకసారి చాంపియన్స్ లీగ్ టీ20 (2011) టైటిల్ గెలిచాడు. కాగా, 2021లో క్రికెట్ నుంచి పూర్తిగా రిటైరైన మలింగ గత రెండు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు తిరిగి తన పూర్వ జట్టు ముంబై శిబిరంలో చేరుతున్నాడు.