luna 25: రష్యా ప్రయోగం విఫలం.. చంద్రుడిపై కూలిపోయిన ‘లూనా-25’!
- రష్యా చేపట్టిన ‘లూనా–25’ ప్రయోగం చివరి క్షణంలో విఫలం
- చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన ల్యాండర్
- వెల్లడించిన రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్
చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా చేపట్టిన ‘లూనా–25’ ప్రయోగం చివరి క్షణంలో విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టడానికి ముందే ల్యాండర్ కుప్పకూలిపోయింది. అనియంత్రిత కక్ష్యలో తిరిగిన తర్వాత ల్యాండర్ కూలిపోయినట్లు తెలిపింది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ఆదివారం అధికారికంగా వెల్లడించింది. లూనా –25లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని తొలుత రష్యా వెల్లడించింది. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అంతరిక్ష నౌక కూలిపోయినట్లు గుర్తించింది.
దాదాపు 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం లూనా–25ను రష్యా చేపట్టింది. చంద్రయాన్–3ని ఇస్రో ప్రయోగించిన కొన్ని రోజుల తర్వాత లూనా–25ను రష్యా ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్–3 కంటే ముందే దిగేలా ఈ ప్రాజెక్టు చేపట్టింది. ల్యాండర్ 21న దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలో ల్యాండింగ్‌కు ముందు ‘ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్’కు చేరేందుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టింది. ఆ సమయంలో అంతరిక్ష నౌకలోని ఆటోమేటిక్ స్టేషన్లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు రాస్‌కాస్మోస్ గుర్తించింది. అప్పటికే వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించింది.