Congress: వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో ఈజీ విక్టరీ.. జగ్గారెడ్డి జోస్యం
- కష్టపడితే మరో 30 స్థానాల్లో విజయం ఖాయమన్న సంగారెడ్డి ఎమ్మెల్యే
- 26న చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
- పార్టీ మార్పు వార్తలను ఖండించిన ఉత్తమ్‌కుమార్
వచ్చే ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అని, గట్టిగా ప్రయత్నిస్తే మరో 30 స్థానాల్లోనూ విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలకు సంబంధించి జగ్గారెడ్డి అభిప్రాయాలను ఠాక్రే అడిగి తెలుసుకున్నారు.
భట్టి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ నేతల భేటీ
మరోవైపు, ఈ నెల 26న చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీనికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సభలో ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో నిన్న భట్టి నేతృత్వంలోని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిక్లరేషన్‌లో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చలు జరిపారు.
ఆ వార్తల్లో నిజం లేదు
తాను పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఖండించారు. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, మంత్రిగా, టీపీసీసీ చీఫ్‌గా ప్రజల కోసం ఎంతో చేశానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూరాబాద్ నుంచి, తన భార్య పద్మావతిరెడ్డి కోదాడ నుంచి పోటీ చేస్తామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.