KTR: తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ రాకపోవడంతో ఓ ఎమ్మెల్యే హరీశ్ రావుపై నోరు పారేసుకున్నారు: కేటీఆర్
- మరి కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
- నేడు తొలి జాబితా ప్రకటించిన అధికార బీఆర్ఎస్ పార్టీ
- మరోసారి సిరిసిల్ల అభ్యర్థిగా మంత్రి కేటీఆర్
- తనపై నమ్మకం ఉంచినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
- పార్టీలో అసంతృప్త గళంపై అసహనం వ్యక్తం చేసిన వైనం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేడు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, మరోసారి తనను సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.
టికెట్ దక్కని అభ్యర్థుల పరిస్థితిపైనా కేటీఆర్ స్పందించారు. "ప్రజా జీవితంలో నిరాశా నిస్పృహలు ఎదురవుతుంటాయి. దురదృష్టవశాత్తు క్రిషాంక్ వంటి అర్హులైన, సమర్థులైన నేతలకు జాబితాలో చోటు కల్పించలేదు. క్రిషాంక్ కు, టికెట్ దక్కని ఇతర నేతలకు ప్రజా సేవ చేసేందుకు మరో రూపంలో అవకాశం దక్కేలా చూస్తాను" అని హామీ ఇచ్చారు.
ఇక, పార్టీలో అసంతృప్తి గళాలపై కేటీఆర్ అసహనం వెలిబుచ్చారు. "మా ఎమ్మెల్యేల్లో ఒకరు తన కుటుంబ సభ్యులకు టికెట్ రాకపోవడంతో నోరు పారేసుకున్నారు... మంత్రి హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యే ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాదు, మనందరం హరీశ్ రావుకు బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. హరీశ్ రావు... బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి అందులో అంతర్భాగంగా కొనసాగుతున్న వ్యవస్థాపక సభ్యుడు. పార్టీ ప్రస్థానంలో మున్ముందు కూడా ఆయన మూలస్తంభంలా వ్యవహరిస్తారు" అంటూ తన బావకు మద్దతు పలికారు.