Rinku Singh: ఐదు సిక్సర్లు నా జీవితాన్ని మలుపు తిప్పాయి: రింకూ సింగ్
- ఐపీఎల్ లో గుజరాత్ జట్టుపై తన ప్రదర్శనను ప్రస్తావించిన రింకూ
- అదే తన కెరీర్ ను మార్చేసిందన్న అభిప్రాయం
- ఐర్లాండ్ పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ కు ఎంపిక
ఐపీఎల్ 2023 సీజన్ లో చెలరేగి ఆడిన యువ ఆటగాళ్లలో కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్ కూడా వున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లో అతడు చూపించిన ప్రతిభతో తొలిసారి భారత జట్టు తరఫున ఆడే అవకాశం లభించింది. దీనికి అతడు ఎంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఐర్లాండ్ తో రెండు టీ20ల సిరీస్ ను భారత్ కైవసం చేసుకోవడం తెలిసిందే.
ఈ సిరీస్ లో భాగంగా తొలిసారి టీమిండియా తరఫున ఆడే అవకాశంతోపాటు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సైతం రింకూ సింగ్ గెలుచుకున్నాడు. 500 డాలర్ల (రూ.41,500) చెక్ ను అతడు అందుకున్నాడు. రెండో టీ20లో 21 బంతులకే 38 పరుగులు సాధించి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది. మొదట 15 బంతులకు 15 పరుగులే సాధించిన రింకూ సింగ్.. ఆ తర్వాత ఒక్క ఓవర్ లో చెలరేగి ఆడాడు.
ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రింకూ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ధన్యవాదాలు చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుపై తాను సాధించిన ఐదు సిక్సర్లు తన మొత్తం కెరీర్ నే మార్చేసినట్టు చెప్పాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ గెలవాలంటే చివరి ఓవర్లో 30 పరుగులు సాధించాల్సి ఉంది. యాష్ దయాళ్ వేసిన చివరి ఓవర్ లో 5 సిక్సర్లు బాది కోల్ కతాకు రింకూ విజయాన్ని అందించాడు.
అభిమానులు స్టాండ్స్ నుంచి రింకూ రింకూ అని ఉత్సాహంగా ప్రోత్సహిస్తుండడాన్ని అతడు ప్రస్తావించాడు. ఐర్లాండ్ పర్యటనలో మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ చాన్స్ రాలేదన్నాడు. రెండో మ్యాచ్ లో వచ్చిన చాన్స్ ను అతడు సద్వినియోగం చేసుకున్నాడు.