Amavasya: అమావాస్య రోజు అప్రమత్తంగా ఉండండి.. యూపీ పోలీసులకు డీజీపీ ఆదేశాలు
- ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసిన డీజీపీ
- అమావాస్య రోజున దొంగలు చురుగ్గా ఉంటారని హెచ్చరిక
- అమావాస్యకు వారం ముందు, తర్వాత వారం రోజులు నైట్ పెట్రోలింగ్ పెంచాలని ఆదేశాలు
నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య రోజున అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు యూపీ డీజీపీ విజయ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జారీచేసిన ఈ ఇంటర్నల్ సర్క్యులర్ బయటకు వచ్చి వైరల్ అవుతోంది. అమావాస్య రోజున నేరగాళ్లు చురుగ్గా ఉంటారని, చాలా వరకు ముఠాలు ఆ రోజున దాడులకు సిద్ధమవుతాయని ఆ సర్క్యులర్‌లో డీజీపీ పేర్కొన్నారు.
ఆగస్టు 14న జారీ చేసిన ఈ సర్క్యులర్‌కు పంచాంగం కాపీని కూడా జత చేశారు. అమావాస్య రోజుల్లో నైట్ పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజున మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆగస్టు 16, సెప్టెంబరు 14, అక్టోబరు 14న అమావాస్య వస్తుందని.. అమావాస్యకు వారం రోజులు ముందు, ఆ తర్వాత వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అంతేకాదు, ప్రజలు కూడా అమావాస్య రోజుల్లో అప్రమ్తతంగా ఉండాలని కోరారు.