German: యూపీఐ పనితీరు చూసి విస్తుపోయిన జర్మనీ మంత్రి
- బెంగళూరులో ఓ కూరగాయల వర్తకుడికి యూపీఐ చెల్లింపులు
- భారత్ విజయవంతమైన గాథల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్న జర్మనీ ఎంబసీ
- సెకండ్లలోనే చెల్లింపులకు వీలు కల్పిస్తోందని ప్రశంస
అత్యంత సులభంగా చెల్లింపులు చేసేందుకు మన దేశం ఆవిష్కరించిన యూపీఐ విధానంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. నేడు దేశంలో అధిక శాతం చెల్లింపులు యూపీఐ విధానంలో నమోదవుతున్నాయి. దీంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం భారత్ దేశ యూపీఐ విధానాన్ని మెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు జర్మనీ మంత్రి ఒకరు యూపీఐ పనితీరును స్వయంగా పరిశీలించి ఆశ్చర్యపోయారు.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ అనేది మొబైల్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ అని తెలిసిందే. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. జర్మనీ డిజిటల్ అండ్ ట్రాన్స్ పోర్ట్ మంత్రి వోకర్ విస్సింగ్ బెంగళూరులో ఓ కూరగాయల వర్తకుడికి యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించారు. దీనిపై జర్మనీ ఎంబసీ ట్విట్టర్ పై ఒక పోస్ట్ విడుదల చేసింది.
‘‘భారత్ దేశ విజయవంతమైన వ్యవస్థల్లో యూపీఐ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ సెకండ్లలోనే లావాదేవీలు పూర్తి చేసేందుకు యూపీఐ వీలు కల్పిస్తోంది. కోట్లాది మంది భారతీయులు దీన్ని వినియోగిస్తున్నారు. డిజిటల్, ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ విస్సింగ్ సైతం యూపీఐ చెల్లింపుల సులభతరాన్ని స్వయంగా వీక్షించారు’’ అని జర్మనీ ఎంబసీ పోస్ట్ చేసింది. బెంగళూరులో ఈ నెల 19న జరిగిన జీ20 దేశాల సమావేశం కోసం జర్మనీ మంత్రి భారత్ కు విచ్చేశారు.
కానీ, ఈ పోస్ట్ కు యూజర్ల నుంచి వస్తున్న కామెంట్లు ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘‘ప్లాస్టిక్ కార్డ్ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. ఈస్ట్ నుంచి వచ్చింది యూపీఐ. త్వరలో మనం ప్రపంచాన్ని ఏలబోతున్నాం’’ అని ఓ యూజర్ స్పందించాడు.