Praggnanandhaa: చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానందపై అభినందనల వర్షం
- సెమీ ఫైనల్ లో ఫాబినోని మట్టికరిపించిన యువ చెస్ కిరణం
- ఫైనల్ లో ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్ సేన్ తో పోటీ
- టైటిల్ గెలవాలంటూ రాహుల్ గాంధీ ఆకాంక్ష
- చెస్ లో భారత స్థానాన్ని మరింత పైకి తీసుకెళడతాన్న ఆనంద్ మహీంద్రా
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరల్డ్ చెస్ సెమీ ఫైనల్ లో ప్రపంచ నంబర్ 3 అయిన ఫాబినో కరువానాను ప్రజ్ఞానంద తన ఎత్తులతో మట్టి కరిపించాడు. అజర్ బైజాన్ లోని బాకులో జరుగుతున్న ఎఫ్ఐడీఈ ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరుకున్న అతి పిన్న వయస్కుడిగా అతడు రికార్డు నమోదు చేశాడు. ఇక ఫైనల్ లో ప్రపంచ నంబర్1 గా ఉన్న మాగ్నస్ కార్ల్ సేన్ ను ఢీకొననున్నాడు. నార్వేకు చెందిన కార్ల్ సేన్ ఇప్పటికి ఐదు పర్యాయాలు టైటిల్ విన్నర్ గా ఉన్నాడు. అతడ్ని కూడా ఓడిస్తే ప్రజ్ఞానంద కీర్తి మరింత ఇనుమడించనుంది.
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటుతున్న ప్రజ్ఞానందకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తదితరులు అభినందనలు తెలియజేశారు. మాగ్నస్ కార్ల్ సేన్ తో జరిగే టైటిల్ మ్యాచ్ లో గెలవాలని కోరుకుంటున్నానంటూ, వంద కోట్లకు పైగా భారతీయులు నిన్ను ఉత్సాహపరుస్తారంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
‘‘నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. ఈ యువ ప్రతిభావంతుడు చెస్ లో భవిష్యత్తులో మనల్ని ఎంతో ఎత్తున నిలబెడతాడు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ సైతం శుభాకాంక్షలు తెలిపారు.