YS Sharmila: చిలక పలుకుల కవితమ్మా! ఢిల్లీలో దొంగ ధర్నా కాదు.. మీ నాన్నతో మాట్లాడు: షర్మిల
- 115 మంది అభ్యర్థుల్లో 7గురు మహిళలకు సీట్లిస్తే రిజర్వేషన్ పాటించినట్లా? అని ప్రశ్న
- ఆకాశం, అధికారం సగం.. సగం అని శ్రీరంగ నీతులు చెప్పే మీరే 6 శాతం ఇస్తే ఎలా? అని నిలదీత
- నాన్నతో మాట్లాడి అన్నింటా మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలని హితవు
రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో కేవలం ఏడుగురు మహిళలే ఉండటంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా స్పందించారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడుతున్న కవిత హైదరాబాద్లో పోరాటం చేయాలని సూచించారు. ఏడు సీట్లు ఇస్తే 33 శాతం మహిళా రిజర్వేషన్ పాటించినట్లా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి? 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా? ఆకాశం, అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లా? కవితమ్మ అని ప్రశ్నించారు. మీరు మారి, మార్పును కోరుకోవాలన్నారు. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలన్నారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నా కేబినెట్లోనూ ప్రాధాన్యత దక్కలేదన్నారు.
లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలని హితవు పలికారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప, మహిళల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన స్పందించిన పాపాన పోలేదన్నారు. రాజధాని నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదన్నారు.
మీ దృష్టిలో మహిళలు వ్రతాలు చేసుకోవడానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారు కానీ రాజకీయాలకు కాదని ధ్వజమెత్తారు. నిజంగా మీకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలన్నారు. సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవితమ్మ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.