Nara Lokesh: తాడేపల్లి ప్యాలెస్ లో పులిని వదులుతాం... జగన్, భూమన కర్రలతో దాన్ని తరమాలి... ఇదే నా చాలెంజ్: లోకేశ్
- గన్నవరంలో లోకేశ్ సభ... పోటెత్తిన జనాలు
- రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించిన టీడీపీ యువనేత
- తిరుమల నడకదారిలో లక్షిత మృతిపై స్పందించిన వైనం
- వైసీపీ నేతలపై సెటైర్లు
- జగన్ కాలి నొప్పికి కారణం చెప్పిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సాయంత్రం గన్నవరంలో లోకేశ్ సభకు భారీ జన స్పందన కనిపించింది. పోటెత్తిన జనాలను చూసి లోకేశ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు. అంశాలవారీగా వైసీపీ నేతలను తూర్పారబట్టారు.
ఇటీవల తిరుమలలో లక్షిత అనే బాలికపై చిరుతపులి దాడి చేసి చంపేయడంపై లోకేశ్ తన ప్రసంగంలో స్పందించారు. "జగన్ ఒక్క కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరు ఏంటో తెలుసా? సైకో కర్రల పథకం. తిరుమల నడకదారిలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. నడకదారి మూసేస్తాం అని ఈవో అంటాడు. లక్షిత తల్లిదండ్రులపై అనుమానం ఉందని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటాడు. జగన్ చివరికి చిన్నారి లక్షిత ప్రాణానికి రూ.10 లక్షలు రేటు కట్టాడు.
ఇక టీటీడీ భూమన కరుణా కర్ర రెడ్డి భక్తులకు కర్రలు ఇస్తాడట! నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా... తాడేపల్లి ప్యాలస్ లో పులిని వదులుతాం. జగన్, కరుణా కర్ర రెడ్డి కర్రలతో ఆ పులిని తరమాలి? ఛాలెంజ్ కి సిద్ధమా?
కర్రలు ఇవ్వాల్సింది భక్తులకు కాదు... రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, ప్రతి ఇంటికి ఒక కర్ర ఇవ్వాలి. వైసీపీ పిచ్చి కుక్కలు వస్తే లాగి రెండు పీకడానికి కర్రలు ఇవ్వాలి" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఈ జనసంద్రంలో జగన్ కొట్టుకుపోవడం ఖాయం
చిత్తూరు చిందేసింది, అనంతపురం అదిరిపోయింది, కర్నూలు కదం తొక్కింది, కడప కేక పుట్టింది, నెల్లూరు నాటు దెబ్బ సూపర్, ప్రకాశంలో జన సునామి, గుంటూరు గర్జించింది, ఇప్పుడు కృష్ణా జనసంద్రంగా మారిపోయింది. ఈ జనసంద్రంలో జగన్ కొట్టుకుపోవడం ఖాయం.
ఉద్యమాల వాడ బెజవాడ. అందరినీ చల్లగా చూసే దుర్గమ్మ ఆలయం ఉన్న పుణ్యభూమి కృష్ణా జిల్లా. మేరిమాత కొలువైన కొండ గుణదల. పాడిపంటలు, సిరులు అందించిన కృష్ణమ్మ పారే నేల కృష్ణా జిల్లా. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య ఈ భూమిపై పుట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విశ్వవిఖ్యాత స్వర్గీయ ఎన్టీఆర్ జన్మించిన గడ్డ కృష్ణా జిల్లా.
ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ ఒకేసారి ఎత్తినట్టు... యువగళం జన ప్రవాహంలా పొంగింది. కృష్ణా జిల్లా మనవడిగా, అల్లుడిగా ఎంతో ఘనచరిత్ర ఉన్న ఈ నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
జగన్ అంత పిరికి వ్యక్తిని నేనెక్కడా చూడలేదు!
కానీ మీ లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన వెంటనే జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పోలీసుల్ని పంపాడు, మనం తగ్గేదేలేదు అన్నాం. మైక్ వెహికల్ లాక్కున్నాడు. మా తాత ఎన్టీఆర్ గారి గొంతు ఇది. ఆపే మగాడు పుట్టలేదు, పుట్టడు. గుడ్లు, రాళ్లు వెయ్యమని పిల్ల సైకోలని పంపాడు. మనవాళ్లు ఆమ్లెట్ వేసి పంపారు.
ఇప్పుడు మళ్లీ ఫ్లెక్సీ కట్టనివ్వం, బ్యానర్లు చింపుతాం, సెక్యూరిటీ ఇవ్వం అంటున్నారు సన్నాసులు. బ్రదర్ జగన్... భయం నా బ్లడ్ లో లేదు. అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతాం. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర... అడ్డుకుంటే దండయాత్ర.
నేను పాదయాత్ర చేస్తుంటే జగన్ కు కాళ్ల నొప్పులు వచ్చాయి!
మనకి వీక్ ఆఫ్ లేదు, జగన్ లా వారానికి మూడు రోజులు కోర్టు పేరుతో రెస్ట్ లేదు.. అయినా మన బండి ఆగదు. మరి జగన్ కి కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి? జగన్ మొన్న నాయకులతో మీటింగ్ పెట్టుకున్నాడట. ఆ మీటింగ్ లో ఉన్న ప్యాలస్ బ్రోకర్ సజ్జలని పిలిచి టీవీ పెట్టమన్నాడట.
ఏ ఛానెల్ పెట్టినా యువగళం జన ప్రభంజనం వార్తలే వస్తున్నాయట. అది చూసి జగన్ కి కోపం వచ్చి అక్కడే ఉన్న టేబుల్ ని గట్టిగా తన్ని టీవీ ఆఫ్ చెయ్యమని చెప్పాడట. కాలు నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరకి వెళ్లి అన్ని టెస్టులు చేయించాడట రిపోర్టులు అన్ని నార్మల్ అని వచ్చాయి.
అదేంటి డాక్టర్... అన్నీ నార్మల్ ఉన్నాయి, నాకేమో కాలు నొప్పి తగ్గడం లేదు అన్నారు. డాక్టర్ వెంటనే... మీరు ఎన్నికల ముందు ఏమి అన్నారో గుర్తుందా అని అడిగారు? మాట తప్పను, మడమ తిప్పను అన్నారు. నాలుగేళ్ళ మూడు నెలలుగా ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ప్రతి రోజు మడమ తిప్పుతూనే ఉన్నారు. అందుకే నొప్పి తగ్గడం లేదు సార్ అన్నాడట ఆ డాక్టర్" అంటూ లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.