treatment cost: ఐదేళ్లలోనే వైద్య చికిత్సా ఖర్చు రెట్టింపు
- వేగంగా పెరుగుతున్న చికిత్సల ధరలు
- మెట్రోల్లో అయితే మరీ ఎక్కువ
- ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సమస్యలకు మరింత వ్యయం
దేశంలో వైద్య చికిత్సల ఖర్చులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే నేడు రెట్టింపైన పరిస్థితి కనిపిస్తోంది. బీమా సంస్థల క్లెయిమ్ లను పరిశీలించినప్పుడు ఈ విషయం తెలిసింది. రిటైల్ ద్రవ్యోల్బణం (ఇన్ ఫ్లేషన్) 6 శాతం స్థాయిలో ఉండడం చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, ఇది సాధారణ నిత్యావసరాలకే పరిమితం. వైద్య, విద్యా ద్రవ్యోల్బణం ఇంతకంటే అధికంగా ఉంటుంది. వైద్య ద్రవ్యోల్బణం 14 శాతం స్థాయిలో ఉంది. మరీ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల చికిత్సల వ్యయాలు అయితే వైద్య ద్రవ్యోల్బణం రేటు 14 శాతం మించి ఏటేటా పెరుగుతున్నట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది.
2018లో ఇన్ఫెక్షన్ వ్యాధులకు సంబంధించి ఓ క్లెయిమ్ సగటు మొత్తం రూ.24,569గా ఉంటే, అది 2022 నాటికి రూ.64,135కు పెరిగింది. అంటే ఏటా 26 శాతం చొప్పున కాంపౌండెడ్ గా పెరిగినట్టు అర్థం అవుతోంది. మెట్రోల్లో ఈ చార్జీలు ఇంకా ఎక్కువే ఉంటున్నాయి. ముంబై వంటి పట్టణాల్లో ఇన్ఫెక్షన్ చికిత్సా వ్యయం సగటున రూ.30వేల నుంచి రూ.80వేలకు పెరిగింది.
శ్వాసకోశ వ్యాధుల క్లెయిమ్ రూ.48,452 నుంచి రూ.94,245కు పెరిగింది. అదే ముంబైలో అయితే దీనికి రూ.80వేలు ఛార్జ్ కాస్తా రూ.1.7 లక్షలకు పెరిగిపోయింది. కరోనా మహమ్మారి చికిత్సా వ్యయాలు పెరిగేందుకు దారితీసింది.