Team India: కేఎల్ రాహుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు? మీకు ఓ విధానం అంటూ ఉందా?: సెలక్టర్లపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ ఆగ్రహం
- ఆసియా కప్‌లో కేఎల్ రాహుల్ ఎంపికను తప్పుబట్టిన
మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ - ఫిట్‌గా లేని వ్యక్తికి చోటివ్వడంపై ఆగ్రహం
- సెలక్టర్లు ఒక పాలసీకి కట్టుబడాలని సూచన
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఫిట్ నెస్ లేని కేఎల్ రాహుల్ కు చోటువివ్వడంపై భారత మాజీ ఓపెనర్, మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సెలక్షన్ ప్యానెల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టులో ఉన్నప్పటికీ చిన్న గాయం వల్ల రాహుల్ సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో జరిగే తొలి పోరులో పాల్గొనే అవకాశం లేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ధ్రువీకరించాడు. అయితే, రాహుల్ సమస్యను ఆయన వివరించలేదు. ఈ క్రమంలో, ఫిట్ గా లేని ఆటగాడిని ఎందుకు ఎంపిక చేశారని శ్రీకాంత్ కమిటీని ప్రశ్నించాడు.
‘కేఎల్ రాహుల్‌కు ఇబ్బంది ఉందని చెబుతున్నారు. అలాంటప్పుడు అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు? సెలక్షన్ సమయంలో ఒక ఆటగాడు ఫిట్‌గా లేకుంటే అతడిని జట్టుకు ఎంపిక చేయకూడదు. నేను చీఫ్ సెలక్టర్ గా ఉన్నప్పుడు అదే మా విధానం. సెలక్షన్ రోజు ప్లేయర్ ఫిట్ గా లేకుంటే సెలెక్ట్ చేసే వాళ్లం కాదు. మీరు రాహుల్ ను వరల్డ్ కప్ లో ఆడించాలని అనుకుంటే వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోండి, అది వేరే విషయం. కానీ, రాహుల్ ను ఆసియా కప్ కు ఎంపిక చేసి ఒకటి రెండు మ్యాచ్ ల తర్వాతే అతడు ఆడుతాడని, అందుకే మేము సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంచుకున్నామని చెబుతున్నారు. అసలు ఇదంతా ఏంటి? అని శ్రీకాంత్ ప్రశ్నించాడు.
ఆసియా కప్ కూడా భారత జట్టుకు ముఖ్యమైన టోర్నీయే అని అన్నాడు. ‘సెలక్షన్ కమిటీ కన్ఫ్యూజన్ లో ఉంది. మీకు సెలెక్షన్ పాలసీ అనేది ఒకటి ఉంటుందని తెలుసుకోవాలి. గతంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి సెలక్షన్ రోజున ఫిట్ గా లేని ఆటగాడిని ఎంపిక చేయకూడదన్న పాలసీని మా ప్యానెల్ పక్కాగా పాటించింది. ఓ టెస్టు మ్యాచ్‌లో మాకు ఇలాంటి సమస్యే ఎదురైంది. అది దక్షిణాఫ్రికాతో టెస్టు. మ్యాచ్ టైమ్ కు ఫిట్ గా ఉంటే ఆడతానని వీవీఎస్ లక్ష్మణ్ మాకు చెప్పాడు. తనను జట్టులో ఉంచమని మమ్మల్ని కోరాడు. కానీ సెలక్షన్ రోజున అతను ఫిట్‌గా లేడు. దాంతో మేం రోహిత్ శర్మను తీసుకోవాలని అనుకున్నాం. కానీ, రోహిత్ ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా అరంగేట్రం చేశాడు’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.