Yarlagadda Venkat Rao: గన్నవరం టీడీపీ ఇంఛార్జ్‌గా యార్లగడ్డను ప్రకటించిన నారా లోకేశ్
- వల్లభనేని వంశీ ఓటమి కోసం అందరం కలసికట్టుగా పని చేస్తామన్న యార్లగడ్డ
- గన్నవరం కంచుకోటపై టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని వ్యాఖ్య
- రౌడీయిజం కోసం కాకుండా... రాజకీయం కోసం వచ్చామని స్పష్టీకరణ
గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌గా కేడీసీసీ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావును ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం ప్రకటించారు. లోకేశ్ యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా యార్లగడ్డను నియమించినట్లు లోకేశ్ ప్రకటించారు.
తనను ఇంఛార్జ్‌గా ప్రకటించిన అనంతరం యార్లగడ్డ మాట్లాడుతూ... గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కలసికట్టుగా పని చేస్తామన్నారు. ఇది టీడీపీ కంచుకోట అని, ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. వల్లభనేని వైసీపీకి మద్దతు పలికినప్పటికీ టీడీపీ శ్రేణులు మాత్రం ఆయన వెంట నడవలేదన్నారు. తాము రౌడీయిజం చేయడానికి రాలేదని, రాజకీయం చేయడం కోసం వచ్చామన్నారు. కొత్త, పాత కలయికలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా తన వద్దకు వచ్చి చెప్పుకోవచ్చునన్నారు.