wagner chief: ఆశ్చర్యమేముంది..?: వాగ్నర్ చీఫ్ మృతిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు
- ప్రిగోజిన్ మరణం ఊహించిందేనన్న బైడెన్
- రష్యాలోని ప్రముఖులకు ఇదొక హెచ్చరిక.. ఉక్రెయిన్
- విశ్వాసంగా లేకుంటే మరణం తప్పదని చెప్పడమే పుతిన్ ఉద్దేశమని వ్యాఖ్య
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఇటీవల తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ బుధవారం చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం కుప్పకూలిపోవడంతో అనుచరులతో సహా కన్నుమూశారు. అయితే, ఈ విషయం తమనేమీ ఆశ్చర్యానికి గురిచేయలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ గా వ్యవహరించిన ప్రిగోజిన్ మరణం అంతా ఊహించిందేనని తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్ కూడా ఈ ప్రమాదంపై స్పందించింది. వాగ్నర్ చీఫ్ మరణం రష్యాలోని ప్రముఖులకు ఓ హెచ్చరికలాంటిదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సహాయకుడు మిఖైలో పొడొలియాక్ చెప్పారు. ఈ ఘటన ద్వారా తనకు విశ్వాసంగా ఉండకపోతే మరణం తప్పదని పుతిన్ వారికి హెచ్చరికలు పంపించినట్లు అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ పై యుద్ధంలో వాగ్నర్ గ్రూపు కూడా పాల్గొంది. ప్రిగోజిన్ స్వయంగా తన దళాలను ముందుండి నడిపించారు. ఈ దళాల వల్లే ఉక్రెయిన్ కు ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, తమకు సరిపడా ఆయుధాలు ఇవ్వట్లేదని, రష్యా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వాగ్నర్ సైనికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రిగోజిన్ ఈ ఏడాది జూన్ లో ఆరోపించారు. అదే నెల 23 వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించి, తన సైనికులను మాస్కో వైపు నడిపించాడు. ఆ మరుసటి రోజే తన నిర్ణయాన్ని ప్రిగోజిన్ ఉపసంహరించుకున్నాడు.
ఈ సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో కల్పించుకుని పుతిన్, ప్రిగోజిన్ మధ్య సంధి కుదిర్చారు. దీంతో అంతా సర్దుకున్నట్లే కనిపించింది. ప్రిగోజిన్ ను మాస్కోకు ఆహ్వానించి పుతిన్ విందు కూడా ఇచ్చారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోవడంతో అమెరికా, ఉక్రెయిన్ సహా పలు దేశాలు పుతిన్ పైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.