Kunamneni Sambasivarao: సీఎం కేసీఆర్‌‌పై కూనంనేని సాంబశివరావు తీవ్ర విమర్శలు

kunamneni sambasivarao fires on brs govt
  • కేసీఆర్ కనీస రాజకీయ విలువలు పాటించలేదన్న కూనంనేని 
  • వెన్నుపోటు ఎలా పొడవాలన్నదే వాళ్ల పని అంటూ మండిపాటు
  • తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిక 
తెలంగాణ సీఎం కేసీఆర్ కనీస రాజకీయ విలువలు పాటించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. వెన్నుపోటు ఎలా పొడవాలి, అధికారంలోకి ఎలా రావాలన్నదే మీ పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ చేసిన తప్పుతో కుమిలిపోకుండా తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. 

హైదరాబాద్‌లో మీడియాతో కూనంనేని మాట్లాడుతూ.. ‘‘మేం ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో చేరి, మిత్ర ధర్మం పాటించలేదని ఒక పత్రికలో రాశారు. అలాంటప్పుడు పొత్తు వద్దని ప్రకటించాలి తప్ప.. ఒక సీటు ఇస్తామని ఎందుకు చెప్పాలి? ‘ఇండియా’ కూటమిలో చేరినందుకే పొత్తు నుంచి వైదొలిగామని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు.. ఒక సీటు ఇస్తామని ఎందుకు సంప్రదింపులు జరిపారు?” అని నిలదీశారు.

2004లో కాంగ్రెస్‌తో 2009లో టీడీపీతో కేసీఆర్‌‌ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఎవరు బలంగా ఉంటే వాళ్లతో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు తమను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 
రాష్ట్రంలో 30 సీట్లలో సీపీఐకి 10 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉందని కూనంనేని చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి తాము బస్సు యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించి.. సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
Kunamneni Sambasivarao
KCR
BRS
CPI

More Telugu News