Vizag: ఖాతాలో వంద రూపాయలు కూడా లేవు.. ఏకంగా వంద కోట్లకు చెక్ రాసి హుండీలో వేసిన భక్తుడు

100 Crores cheque found in Simhachalam Appana Temple Hundi in Vizag

  • వైజాగ్ లోని సింహాద్రి అప్పన్న హుండీలో వంద కోట్ల చెక్
  • బ్యాంకును సంప్రదించడంతో బయటపడ్డ నిజం
  • భక్తుడిపై చర్యలు తీసుకునే యోచనలో ఆలయ అధికారులు

బ్యాంకు ఖాతాలో వంద రూపాయలు కూడా లేవు కానీ ఏకంగా రూ.వంద కోట్లకు చెక్ రాసి దేవుడి హుండీలో వేశాడో భక్తుడు.. ఆ చెక్ ను చూసిన సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆలయ చరిత్రలోనే కనీవినీ ఎరగని విరాళమని సంతోషం వ్యక్తం చేశారు. ఆ భక్తుడి ఖాతా గురించి ఆరా తీయగా.. సదరు భక్తుడి ఖాతాలో ఉన్న సొమ్ము కేవలం రూ.17 మాత్రమేనని తేలడంతో షాక్ కు గురయ్యారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. బ్యాంకు నుంచి అధికారికంగా సమాచారం తీసుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో చోటుచేసుకుందీ ఘటన.

సింహాచలం వరాహాలక్ష్మి నర్సింహ స్వామి హుండీని ఆలయ సిబ్బంది ప్రతీ 15 రోజులకు ఒకసారి తెరిచి, భక్తులు వేసిన కానుకలను లెక్కిస్తుంటారు. తాజాగా హుండీ లెక్కింపు సందర్భంగా ఓ చెక్ కనిపించింది. అందులో స్వామి వారికి రూ. 100 కోట్ల విరాళం రాశాడో భక్తుడు. ఆలయ చరిత్రలోనే భారీ విరాళం కావడంతో సదరు భక్తుడిని గుర్తించి, ఆలయ మర్యాదలతో మరోమారు స్వామి వారి దర్శనం చేయించాలని అధికారులు భావించారు. అందుకు ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమయ్యారు. 

అజ్ఞాత భక్తుడి భారీ విరాళం గురించి తెలియడంతో మీడియా ఆలయ అధికారులను సంప్రదించింది. దీంతో అధికారులు ఆ విరాళానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. బ్యాంకును సంప్రదించగా.. ఆ చెక్ బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తికి చెందినదని, అతని ఖాతాలో ప్రస్తుతం ఉన్న మొత్తం కేవలం రూ.17 మాత్రమేనని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో ఇది ఆకతాయితనంగా చేసిన పనా లేక మతిస్థిమితంలేక చేసిన పనా.. అంటూ ఆలయ సిబ్బంది అనుమానిస్తున్నారు. చెక్కును బ్యాంకుకు పంపించి, అధికారికంగా వివరాలు తెలుసుకున్న తర్వాత ఏంచేయాలనేది నిర్ణయిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. సదరు భక్తుడిపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News