Bonda Uma: జగన్ రెడ్డి దొంగ బటన్లు నొక్కుతూ తన ఖజానా నింపుకుంటున్నాడు: బొండా ఉమ
- మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో బొండా ఉమ ప్రెస్ మీట్
- సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
- వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమం కంటే ప్రచారమే ఎక్కువని వెల్లడి
- పథకాలన్నింటిని కుదించి నవరత్నాలు అంటున్నారని విమర్శలు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
జగన్ రెడ్డి దొంగ బటన్లు నొక్కుతూ, మోసకారి సంక్షేమంతో ప్రజల్ని వంచిస్తూ, అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేసి, తన ఖజానా నింపుకుంటున్నాడని మండిపడ్డారు. బటన్ నొక్కుడు పేరుతో ఒక చేతికి రూ.10 ఇస్తూ, మరో చేతి నుంచి రూ.100 లాక్కుంటున్నాడని వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందుతున్న సంక్షేమం గోరంత... జరుగుతున్న ప్రచారం కొండంత అని వ్యాఖ్యానించారు. సాక్షి మీడియా ప్రకటనల్లో కనిపిస్తున్న సంక్షేమ ఫలాలు వాస్తవంలో కనిపించడం లేదని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి హయాంలో ధర పెరగని వస్తువు ఏదైనా ఉందా? పన్నుల భారం పడని కుటుంబం ఒక్కటైనా ఉందా? అని బొండా ఉమ ప్రశ్నించారు.
జగన్ రెడ్డి హయాంలో బడ్జెట్ రూ.9.50 లక్షల కోట్లకు చేరినా, సంక్షేమానికి 15 శాతం కూడా ఖర్చు చేయలేదని అన్నారు. రూ.10 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో, ఎటు పోయిందో జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని నిలదీశారు. టీడీపీ పాలనతో పోల్చితే... ఆదాయం పెరిగినా, లక్షల కోట్ల అప్పులు తెచ్చినా పేదలకు మాత్రం జగన్ రెడ్డి మొండిచెయ్యే చూపాడని తెలిపారు.
జగన్ రెడ్డి, చంద్రబాబులలో ఎవరు సంక్షేమానికి ఎక్కువ నిధులు వెచ్చించారనేది బడ్జెట్ లెక్కలు, సీ.ఎఫ్.ఎమ్.ఎస్, కాగ్ సమాచారమే చెబుతోందని బొండా ఉమ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల తీరుని, 2014-19మధ్య టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన వాటిని సరిపోల్చి, ఆధారాలతో సహా జగన్ రెడ్డి మోసకారి సంక్షేమాన్ని నిరూపిస్తామని తేల్చిచెప్పారు.
పథకాలన్నింటినీ కుదించి నవరత్నాలని చెప్పిన జగన్ వాటిలో కొత్తగా అమలు చేసింది ఏమీ లేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పేదలకు 12 లక్షల ఇళ్లు కట్టిస్తే, జగన్ రెడ్డి నాలుగేళ్లలో కట్టింది 833 ఇళ్లు మాత్రమేనని అన్నారు.
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.10,130 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ కు చెల్లిస్తే, జగన్ రెడ్డి విడతలవారీగా నాలుగేళ్లలో కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే చెల్లించాడని ఆరోపించారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చాడని మండిపడ్డారు.