Tamilisai Soundararajan: కేసీఆర్ ఆహ్వానం మేరకు సెక్రటేరియట్ కు వెళ్తున్న గవర్నర్ తమిళిసై
- సచివాలయంలో దేవాలయం, మసీదు, చర్చిల ప్రారంభోత్సవ కార్యక్రమం
- కార్యక్రమానికి గవర్నర్ ను ఆహ్వానించిన కేసీఆర్
- మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్, సీఎం
నూతన సచివాలయంలో నిర్మించిన దేవాలయం, మసీదు, చర్చిలను ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. నిన్న మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆలయం, మసీదు, చర్చిల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలంటూ ఈ సందర్భంగా గవర్నర్ ను సీఎం కోరారు. ఆయన ఆహ్వానం మేరకు తొలిసారి ఆమె సెక్రటేరియట్ కు వస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే సెక్రటేరియట్ లోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభమయింది. స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం, వేద పారాయణం, మహాలక్ష్మీ యాగం, మహామంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. చండీయాగం, ప్రాణప్రతిష్ఠ హోమం, ధ్వజస్తంభం, విగ్రహాల ప్రతిష్ఠ, వేదోక్తంగా ప్రాణప్రతిష్ఠ, ఆలయ శిఖర కుంభాభిషేకం, మాహా పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొంటారు.