Telangana: టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోని వీహెచ్, రేణుకాచౌదరి
- 18న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగింపు
- దరఖాస్తు చేసుకోని సీనియర్ నేతల్లో జానారెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్
- సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ తనయుడు ఆదిత్యరెడ్డి
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు దాదాపు వెయ్యి మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసింది. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో దరఖాస్తు చేయడానికి చాలామంది అశావహులు తరలి వచ్చారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో పలువురు సీనియర్ నేతలు టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. దరఖాస్తు చేసుకోని సీనియర్ నేతల్లో మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రులు గీతారెడ్డి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, నిరంజన్, కోదండరెడ్డి, మల్లు రవి వున్నారు.
ఇదిలా ఉండగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎల్బీ నగర్ నుండి దరఖాస్తు చేసుకున్నారు. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మల్ రెడ్డి రంగారెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి జానారెడ్డి ఇద్దరు తనయులు దరఖాస్తు చేశారు. సనత్ నగర్ నుండి మర్రి శశిధర్ తనయుడు ఆదిత్యరెడ్డి దరఖాస్తు చేశారు.