PM Modi: కర్ణాటక సీఎం తనకు ఆహ్వానం పలకకపోవడంపై పీఎం మోదీ స్పందన
- బెంగళూరుకు చేరుకునే సమయంపై స్పష్టత లేదని వివరణ
- మంత్రులను ఇబ్బంది కలిగించకూడదని అనుకున్నట్టు వెల్లడి
- దీనిపై విమర్శలు కురిపించిన కాంగ్రెస్ పార్టీ
ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు ఇస్రో సెంటర్ ను సందర్శించడం, చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ విజయానికి తోడ్పడిన శాస్త్రవేత్తలను అభినందించడం చూశాం. అయితే, ప్రధాని బెంగళూరు పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ప్రధాని నరేంద్ర మోదీని బెంగళూరు విమానాశ్రయం వద్ద స్వాగతించలేదు. ప్రధాని మోదీ వారిని ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచి, ప్రొటోకాల్ ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపించింది.
సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ దీనిపై ఎక్స్ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశారు. ‘‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తనకంటే ముందు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడం పట్ల ఆయన (ప్రధాని) ఎంతో చిరాకుగా ఉన్నారు. అందుకే వారు తనను విమానాశ్రయంలో ఆహ్వానించకుండా దూరం పెట్టారు. ఇది చిల్లర రాజకీయం తప్ప మరొకటి కాదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రయాన్-1 ను విజయవంతంగా ప్రయోగించిన వెంటనే.. 2008 అక్టోబర్ 22న అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ను నాటి సీఎం మోదీ సందర్శించిన విషయం ఇప్పటి పీఎం మర్చిపోయారా?’’ అంటూ జైరామ్ రమేశ్ ప్రశ్నించారు.
దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగళూరుకు సరిగ్గా ఏ సమయానికి చేరుకునేది స్పష్టత లేకపోవడంతో మంత్రులకు ఇబ్బంది కలిగించకూడదని అనుకున్నట్టు చెప్పారు. ‘‘బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటానన్నది నాకు తెలియదు. నా కోసం ముందుగా వచ్చి ఇబ్బంది పడొద్దని సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్ ను కోరాను’’ అని బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్ట్ వద్ద ప్రధాని చెప్పారు.