Chandrayaan-3: చంద్రయాన్-3 విజయంపై పాకిస్థాన్ స్పందన!
- చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ చారిత్రక విజయమన్న ముంతాజ్
- భారత్ టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిందని కితాబు
- భారత్ నుండి పాకిస్థాన్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్న డాన్ పత్రిక
చంద్రయాన్-3పై దాయాది పాకిస్థాన్ కాస్త ఆలస్యంగా స్పందించింది. భారత్ చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్ అయిన రెండు రోజుల తర్వాత పాక్ స్పందిస్తూ... దీనిని గొప్ప సైంటిఫిక్ విజయంగా పేర్కొంది. పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ఇదివరకే ప్రశంసలు కురిపించారు. తాజాగా విదేశీ వ్యవహారాల కార్యాలయాధికారి ముంతాజ్ జహ్రా బలోచ్ సాఫ్ట్ ల్యాండింగ్ చారిత్రక విజయంగా పేర్కొన్నారు. భారత్ టెక్నాలజీపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, ఇది గొప్ప విజయమని, ఈ విజయానికి ఇస్రో శాస్త్రవేత్తలు అర్హులు అంటూ వారికి అభినందనలు తెలిపారు.
భారత్ సాధించిన ఈ విజయంపై పాకిస్థాన్ నిన్నటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఈ ప్రయోగం వార్త పాక్ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. డాన్ పత్రిక తన సంపాదకీయంలో 'ఇండియాస్ స్పేస్ క్వెస్ట్' శీర్షికతో చంద్రయాన్-3 మిషన్ ప్రయోగం చారిత్రక విజయంగా పేర్కొంది. ధనిక దేశాలు కూడా ఈ ప్రయోగాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని, భారత్ మాత్రం తక్కువ ఖర్చుతో చేయడంపై ప్రశంసలు కురిపించింది.
ప్రభుత్వ మద్దతుతో పాటు ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ విజయానికి కారణమని పేర్కొంది. పోలిక పెట్టలేమని, కానీ భారత్ అంతరిక్ష ప్రయోగం నుండి పాకిస్థాన్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని డాన్ తన సంపాదకీయంలో పేర్కొంది. పాకిస్థాన్ స్పేస్ భారత్ ఇస్రో కంటే ముందే ప్రారంభమైందని గుర్తు చేసింది.