mynampalli hanmantharao: బీఆర్ఎస్ ముఖ్యనేత నాకు ఫోన్ చేసి, తొందరపడొద్దన్నారు: మైనంపల్లి
- కార్యకర్తలతో సమావేశమైన మైనంపల్లి హన్మంతరావు
- ప్రాణం పోయే వరకు ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతానని వ్యాఖ్య
- వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే తాను ఊరుకునే రకం కాదని స్పష్టీకరణ
- తనకూ సత్తా ఉందని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరిక
బీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు తనకు ఫోన్ చేశారని, తొందరపడవద్దని తనకు సూచించారని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం అనుచరులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. మెదక్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల నుండి కార్యకర్తలు తరలి వచ్చారు. సమావేశం అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ... తాను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదన్నారు. ప్రాణం పోయే వరకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతానన్నారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే ఊరుకునే రకం కాదని, తానూ ఇబ్బంది పెడతానన్నారు. తనకు సత్తా ఉందని.. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు.
తనకు ఫోన్ చేసిన బీఆర్ఎస్ ముఖ్యనేత.. ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకోమని చెప్పారన్నారు. రేపటి నుండి వారం రోజుల పాటు మల్కాజిగిరి నియోజకవర్గంలో తిరుగుతానని, ఆ తర్వాత మాట్లాడుతానని చెప్పారు. మీడియాను పిలిచి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. పార్టీ తనను ఏమీ అనలేదని, తానూ పార్టీని ఏమీ అనలేదని చెప్పారు. తాను కాంగ్రెస్, బీజేపీ... ఏ పార్టీని తిట్టనని చెప్పారు. కానీ తనను ఇబ్బంది పెడితే మాత్రం వారిని ఇబ్బంది పెడతానన్నారు. పార్టీలో తమను అణచివేశారన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో తనను పోటీ నుండి తప్పుకోవాలని చాలామంది చెప్పారని, కానీ తన అనుచరుల కోసం తాను ఉప ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. ఓడిపోయినప్పటికీ తాను బాధపడలేదన్నారు. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్‌గా తీసుకోవద్దని, అది గెలుపుకు మొదటి అడుగు అని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాణం పోయే వరకు రాజకీయాల కోసం మాటలు మార్చనని చెప్పారు. తనను ఉప ఎన్నికల్లో మెదక్ ప్రజలు గెలిపించారన్నారు. తనకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల వారు అప్పుడు ఓటు వేశారన్నారు. మల్కాజిగిరిలో పోటీ చేసినప్పుడు కూడా మెదక్ ప్రజలు తనకు రాజకీయ భిక్ష పెట్టినట్లు చెప్పానన్నారు.
తన కొడుకుకు పాతికేళ్లు ఉన్నాయని, ఇంకా భవిష్యత్తు ఉందన్నారు. భారత్ లో పోటీతత్వం ఉందని, తన కొడుకు తన కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మెదక్‌లో తిరిగి తన కొడుకు ప్రజాభిప్రాయం కోరుతాడన్నారు.