Terrorists: హైదరాబాద్ ఉగ్రవాదులకు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన ఎన్ఐఏ కోర్టు
- అబుదాభి మాడ్యూల్ ద్వారా పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులు
- 2018లో అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- 2019లో ఇద్దరిపై సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు
హైదరాబాద్ కు చెందిన ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ లను దోషులుగా తేల్చిన ఎన్ఐఏ ఢిల్లీ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళ్తే అబుదాభి మాడ్యూల్ ద్వారా పేలుళ్లకు వీరు కుట్ర పన్నారు. ఐసిస్ వైపు యువతను ఆకర్షించేందుకు బాసిత్ ప్రయత్నం చేశాడు. అతనికి మరో ఉగ్రవాది అద్నాన్ హుస్సేన్ నిధులను సమకూర్చాడు. ఈ డబ్బుతో యువకులకు బాసిత్ వీసా, పాస్ పోర్టులు ఏర్పాటు చేశాడు. 2017లో అబ్దుల్ బాసిత్ ఇంటర్వ్యూ చూసి అబ్దుల్ ఖాదిర్ ఆకర్షితుడయ్యాడు. అతను నిర్వహించిన ఐసిస్ కార్యక్రమాలకు హాజరయ్యాడు. 2018లో వీరిద్దరినీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2019లో ఇద్దరిపై సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాజాగా శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది.